యాస్మిన్‌ మృతిపై సమగ్ర విచారణ : కెవిపిఎస్‌ డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దళిత యువకుడిని కులాంతర వివాహం చేసుకున్న యాస్మిన్‌ మృతిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒ నల్లప్ప, అండ్ర మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రేమ, కులాంతర వివాహం కావడంతో మొదటి నుంచి అమ్మాయి తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించకపోవడం చూస్తే యాస్మిన్‌ మరణం అనుమానాలకు తావిస్తుందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. యాస్మిన్‌ భర్త పరువు హత్యగా చెప్పినా ఇప్పటి వరకూ విచారణ చేపట్టకపోవడాన్ని తప్పుబట్టారు. తండ్రి అనారోగ్యంతో ఉన్నాడని యాస్మిన్‌ను తీసుకెళ్లిన గంటకే మరణవార్త వినడం దుర్మార్గమన్నారు.

అంబేద్కర్‌ స్మృతివనం నిర్వహణకు పిపిపి విధానం వొద్దు

విజయవాడలోని పిడబ్ల్యుడి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ స్మృతివనం నిర్వహణను పిపిపి విధానంలో చేపట్టాలనే ఆలోచన విరమించుకోవాలని కెవిపిఎస్‌ రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి, కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒ నల్లప్ప, అండ్ర మాల్యాద్రి లేఖ రాశారు. స్మృతివనం నిర్వహణ కోసం శాశ్వత నిధిని ఏర్పాటుచేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని కోరారు.

దోషులను కఠినంగా శిక్షించాలి

కాకినాడ జిల్లా శంఖవరం దళిత పేటలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన దుండగులను గుర్తించి కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని అండ్ర మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ను అవమానించడం అంటే భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్లేనని, ఇలాంటి విద్వేష చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలన్నారు.

➡️