అపోలో ఆసుపత్రి వద్ద మృతుని కుటుంబీకుల ఆందోళన

ప్రజాశక్తి – ఆరిలోవ : ఆరిలోవ హెల్త్‌సిటీలోని అపోలో ఆసుపత్రి వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. చికిత్స కోసం చేరిన బాలుడు మృతి చెందాడు. పెండింగ్‌ బిల్లు చెల్లించి మృతదేహం తీసుకెళ్లాలని ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో మృతుని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. కుమారుని పోగొట్టుకున్న బాధలో తాము ఉన్నామని, ఎటువంటి చెల్లింపులు చేయలేమని కుటుంబ సభ్యులు భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వచ్చి ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు.
ఆరిలోవ బాలాజీనగర్‌కు చెందిన నిఖిల్‌ వెంకటసాయి కొన్ని రోజుల క్రితం జ్వరంతో ఫిట్స్‌ వచ్చి అపోలో ఆసుపత్రిలో చేరాడు. ప్రారంభంలో దఫదఫాలుగా రూ.3.65 లక్షలు అడ్వాన్సుగా చెల్లించారు. దీంతో పాటు బాలునికి ఉన్న ఇన్స్యూరెన్స్‌ రూ.7 లక్షలను ఆసుపత్రి యాజమాన్యం క్లైమ్‌ చేసుకుంది. బాలుడు మృతి చెందడంతో మొత్తం బిల్లు రూ.22 లక్షలు అయిందని, మిగతా 12 లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది. కుమారుని పోగొట్టుకున్న బాధలో ఉన్నామని, వైద్య ఖర్చుల నిమిత్తం దాతలు ఇచ్చినవి, తమ దగ్గర ఉన్నవి అన్నీ ఇప్పటికే పెద్ద మొత్తంలో చెల్లించామని, తమ దగ్గర ఇంకా ఏమీ లేవని వేడుకున్నారు. అయినా ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించకపోవడంతో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. స్థానిక మాజీ కార్పొరేటర్‌ ఒమ్మి సన్యాసిరావు, బుడుమూరు గోవిందరావు, పోలారావు, గాడి సత్యం, ముగడ రాజారావు, మజ్జి రమణి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన చేపట్టారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం ఏమీచేయలేక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

➡️