ఒప్పందాలు అమలు చేయకుంటే ఆందోళన ఉధృతం

  • రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికుల రిలే దీక్షలు, ధర్నాలు

ప్రజాశక్తి-యంత్రాంగం : ఇంజనీరింగ్‌ కార్మికుల జీతాలు పెంపు, సమ్మె కాలపు ఒప్పందాలకు జిఒలు జారీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్యాలయాల వద్ద శుక్రవారం ధర్నాలు, నిరసన దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం అంగీకరించిన రిటైర్డ్‌మెంట్‌ బెనిఫిట్స్‌, ఎక్స్‌గ్రేషియా, ఇంజనీరింగ్‌ కార్మికుల జీతాల పెంపు, సంక్షేమ పథకాలను అమలు చేయాలని, ఎన్‌ఎంఆర్‌ ఇంజనీరింగ్‌ కార్మికులకు, క్లాప్‌ డ్రైవర్లకు, బదిలీ కార్మికులకు జిఒ 36 వర్తింపజేయాలని, రక్షణ పరికరాలు ఇవ్వాలని, సిబ్బంది సెలవు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

విజయవాడ ధర్నా చౌక్‌లో నగర పాలక సంస్థకు చెందిన ఇంజనీరింగ్‌ కార్మికులు చేపట్టిన దీక్షలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వర రావు, నగర గౌరవాధ్యక్షులు ధోనిపూడి కాశీనాథ్‌ మాట్లాడుతూ.. సమ్మె సందర్భంగా ప్రభుత్వం 9 మంది ఐఎఎస్‌ అధికారులతో వేసిన కమిటీ నివేదిక ఆర్థిక శాఖలో ఉందని, ప్రభుత్వం మారినా దాని గురించి పట్టించుకోలేదని అన్నారు. ఇప్పటికైనా ఇంజనీరింగ్‌ కార్మికుల సమస్యలను మున్సిపల్‌ శాఖ మంత్రి పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులు మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన చేపట్టారు. అనంతరం మున్సిపల్‌ మేనేజర్‌ విల్సన్‌ జైకర్‌కు వినతిపత్రం అందజేశారు. భీమవరంలో నిరసన, తాడేపల్లిగూడెంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఏలూరులోని నగర పాలక సంస్థ కార్యాలయం, జంగారెడ్డిగూడెంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు చేపట్టారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద దీక్షలు, అనకాపల్లిలో జివిఎంసి జోనల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తిరుపతి జిల్లాలో నాయుడుపేట, గూడూరులో ఆందోళనలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లాలోని మున్సిపల్‌ కార్యాలయాల వద్ద నిరసన దీక్షలు, ధర్నాలు చేపట్టారు. సాలూరులో జరిగిన దీక్షలో యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్‌వై నాయుడు పాల్గొని మాట్లాడారు. పాలకొండ, పార్వతీపురం, విజయనగరం, గుంటూరు జిల్లా మంగళగిరిలో ధర్నాలు నిర్వహించారు. కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో రిలే దీక్షలు చేపట్టారు.

➡️