ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, అమరావతి బ్యూరో : ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం విశాఖకు వస్తున్న సందర్భంగా పలువురు సిపిఎం నాయకులు, కార్యకర్తలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ చర్యను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా స్టీల్‌ప్లాంట్‌కు ముడి ఇనుప గనుల కేటాయింపు, సెయిల్‌లో విలీనం, రూ.18వేల కోట్ల ప్యాకేజీ సమస్యను పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ జరగకుండా చూస్తామని, నక్కపల్లిలో భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి నేడు ఆ సమస్యలను పరిష్కరించకుండా సిపిఎం నాయకులను గృహ నిర్బంధించడం ప్రజాస్వామ్య హక్కులను ఖూనీ చేయడమేనన్నారు. ఎటువంటి అరెస్టులు గృహనిర్బంధాలు ఉండవని గతంలో మంత్రి లోకేష్ గొప్పగా ప్రకటించి, నేడు సిపిఎం నాయకులను నిర్బంధించడాన్ని బట్టి వారి మాటలకు చేతలకు ఎంతో తేడా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ చేయడం లేదని, నక్కపల్లిలో బల్క్‌డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయడం లేదని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ఎస్.రాయవరం మండలం ధర్మవరంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అచ్యుతాపురం మండల కన్వీనర్ ఆర్.రాము, మండల కమిటీ సభ్యులు సోమునాయుడు, కె.కోటపాడు మండల నాయకులు ఎర్రా దేముడు, కశింకోట మండల నాయకులు దాకారపు శ్రీనివాసరావు, డిడి.వరలక్ష్మి, నక్కపల్లిలో మరో ముగ్గురు నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రభుత్వ, పోలీసు తీరును సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. లోకనాథం ఖండించారు.