ప్రజాశక్తి-విజయవాడ : పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య మృతిపట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర ద్రిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులుగా, 2000 నుండి 2011 వరకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బుద్దదేవ్ మృతిపట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నది. బుద్దదేవ్ భట్టాచార్య తన రాజకీయ ప్రస్థానాన్ని విద్యార్థి ఉద్యమంతో ప్రారంభించి, 1968లో డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్‌కు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1966లో సిపిఐయంలో చేరి అంచెలంచెలుగా పోలిట్‌బ్యూరో స్థాయికి ఎదిగారు. 1985లో కేంద్ర కమిటీకి, 2000లో పోలిట్‌బ్యూరోకి ఎన్నికై 2015 వరకూ ఈ బాధ్యతల్లో కొనసాగారు. బుద్దదేవ్ స్వయంగా రచయిత. బెంగాలి సాహిత్యం మరియు సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సాదారణ జీవితం గడిపారు. చివరి వరకూ రెండు గదుల అపార్ట్‌మెంట్‌లో జీవనాన్ని గడిపారు. దాదాపు మూడు దశాబ్దాలు బెంగాల్ లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వంలో విశేషమైన కృషి చేశారు. ఆయన మరణంతో బెంగాల్ వామపక్ష ఉద్యమంలో ఒక అధ్యాయం ముగిసింది. ఎపి రాష్ట్ర కమిటీ ఆయనకు నివాళులు అర్పిస్తుంది. ఆయన భార్య, కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నది.
