సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించండి

Aug 24,2024 22:15 #Conduct, #safety audit

– పరిశ్రమల్లో ప్రమాదాలు పునరావృతం కారాదు
– భద్రతా చర్యలు తీసుకోవాలి
– పరిశ్రమల యాజమాన్యాలతో హోం శాఖ మంత్రి అనిత
ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి :సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించి లోపాలను సరిచేసుకోవాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పరిశ్రమల యాజమాన్యాలకు సూచించారు. ఫార్మా, ఇతర పరిశ్రమల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రమాద రహిత పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు పొందేలా ప్రయత్నం చేయాలని సూచించారు. పరిశ్రమల భద్రతపై అనకాపల్లిలోని ఎస్‌ఆర్‌.శంకరన్‌ భవన్‌లో పరిశ్రమల యజమానులు, అధికారులతో కలిసి శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఫైర్‌, గ్యాస్‌ లీకైనప్పుడు అప్రమత్తం చేసే అలార్మింగ్‌ వ్యవస్థ పనిచేసేలా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పైపులైన్‌ బాగాలేదని తెలియజేసినా ఎసెన్షియా యాజమాన్యం పట్టించుకోలేదని తెలిపారు. ఆ నిర్లక్ష్యమే కంపెనీలో 17 మంది మరణానికి దారితీసిందన్నారు. తక్కువ జీతాలకు నైపుణ్యంలేని కార్మికులతో పనిచేయించడం కూడా ప్రమాదాలకు దారితీస్తోందని వివరించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు సురక్షితంగా బయటపడే నైపుణ్యాలను మాక్‌డ్రిల్‌ ద్వారా మెళకువలు నేర్పించాలని సూచించారు. కొన్ని పరిశ్రమల్లో వెంటిలేషన్‌ కూడా సరిగాలేదని అసహనం వ్యక్తం చేశారు. పరిశ్రమల ప్రాంతాల్లోని స్టేషన్లలో పోలీసులను పెంచనున్నట్లు తెలిపారు. అనకాపల్లి ఎంపి సిఎం రమేష్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ పరిశ్రమల భద్రత సలహాదారులను సంప్రదించి భద్రతా ప్రమాణాల అమలుకు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయకుమార్‌, పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ ఇండిస్టియల్‌ సేఫ్టీ ప్రొటోకాల్‌ను అమలు చేయడం ద్వారా ప్రమాదాలను నియంత్రించవచ్చని తెలిపారు. ప్రమాద సమయాల్లోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ భద్రత అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జెఎన్‌పిసి మ్యూచువల్లీ ఎయిడెడ్‌ సొసైటీ ఫర్‌ రిస్క్‌ మిటిగేషన్‌ కార్యదర్శి జె.సుబ్బారావు, అచ్యుతాపురం సెజ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మన్యప్రసాద్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీధర్‌, ఎస్‌పి దీపిక, ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ చిన్నారావు పాల్గన్నారు.
పరిశ్రమల తనిఖీ అధికారిపై అనిత అసహనం
‘మీ తెలివి తేటలు ఇక్కడ కాదు. పూర్తి సమాచారంతో ఇక్కడకొచ్చి కూర్చొన్నా. బ్రాండిక్స్‌లో ఎన్నిసార్లు తనిఖీ చేశారో చెప్పండి’ అని జిల్లా పరిశ్రమల తనిఖీ అధికారి చిన్నారావుపై హోం శాఖ మంత్రి అనిత అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో పరిశ్రమల ప్రమాదాలను చిన్నారావు వివరిస్తుండగా మంత్రి అనిత జోక్యం చేసుకొని భద్రత పాటించని పరిశ్రమలపై ఏ చర్యలు తీసుకున్నారు? ఎన్ని పరిశ్రమల్లో తనిఖీలు చేశారు? లోపాలను గుర్తించినా భద్రతా ప్రమాణాలు పాటించేలా ప్రయత్నం ఎందుకు చేయడంలేదు ? అని నిలదీశారు. ఎసెన్షియా ఫార్మాలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని, పైపులైన్‌ బాగుచేసివుంటే ఈ ప్రమాదం జరిగేది కాదని అన్నారు. దీనిపై చిన్నారావు వివరణ ఇవ్వగా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు.

➡️