– నాసన్‌లో ఐఆర్‌ఎస్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో పంకజ్‌చౌదరి
ప్రజాశక్తి-గోరంట్ల (సత్యసాయి జిల్లా) :
ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్‌ఎస్)లో శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లోకి వెళ్తున్న వారు సేవాభావం, దేశభక్తితో విధులు నిర్వహించాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ అకాడమీ (నాసన్)లో 75వ ఐఆర్‌ఎస్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంకజ్ చౌదరి మాట్లాడుతూ… భారత మిత్ర దేశమైన భూటాన్ అధికారులు నాసన్‌లో శిక్షణ పొందడం ఇరు దేశాల మైత్రికి దోహద పడుతుందన్నారు.స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాలతో పేద బలహీన వర్గాల యువతీ యువకులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. భవిష్యత్తులో మరింత మంది సమర్ధత కలిగిన అధికారులు దేశ సేవ చేయడం కోసం నాసన్ అకాడమీ నుంచే తయారు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిబిఐసి బోర్డు మెంబర్ అరుణ నారాయణ గుప్తా, తదితరులు పాల్గన్నారు.
42 మంది శిక్షణ పూర్తి
పాలసముద్రం నాసన్ అకాడమీ రెండవ బ్యాచ్‌లో42 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 25 మంది పురుషులు, 17 మంది మహిళా అధికారులు ఉన్నారు. వీరిలో రాయల్ గవర్నమెంట్ ఆఫ్ భూటాన్‌కు చెందినవారు ఐదు మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.