రాష్ట్రంలో కులగణన చేపట్టాలి :  కాంగ్రెస్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కులగణన విషయంలో బిజెపి ఉచ్చులో పడకుండా, రాష్ట్రంలో వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్‌ షర్మిల మంగళవారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి దిక్సూచిగా పేర్కొన్నారు. ఆ రాష్ట్ర జనాభాలో 56 శాతం బిసిలు, 17 శాతం ఎస్‌సిలు, 10 శాతం ఎస్‌టిలు అంటే దాదాపు 80 శాతం వెనుకబడిన, బలహీనవర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశమన్నారు. రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.
జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. గత వైసిపి ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినా సిఎం జగన్‌ ఆ వివరాలను తొక్కిపెట్టారన్నారు. బిజెపి డైరెక్షన్‌లోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారని చెప్పారు. దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేస్తుంటే, రిజర్వేషన్లు రద్దుకు కుట్ర అని బిజెపి తప్పుదారి పట్టించడం దారుణమన్నారు.

➡️