తెలంగాణ : నేడు జరిగిన తెలంగాణ శాసన సభలో వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. వారి వ్యాఖ్యలతో దుమారం రేగింది. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పద్దులపై తెలంగాణ శాసనసభలో బుధవారం చివరి రోజు చర్చ కొనసాగుతోంది. సాధారణ పరిపాలన, న్యాయ, హోం, ఆర్థిక, ఇంధన, లెజిస్లేచర్, రెవెన్యూ, గృహనిర్మాణం, ఐ అండ్ పీఆర్, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల పద్దులపై సభలో చర్చ చేపట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరం అదనపు వ్యయం అంచనాలపై నేడు ఉభయ సభల్లో చర్చ జరుగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం అదనపు వ్యయం అంచనాలను మంగళవారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. అదనపు వ్యయం అంచనా రూ.50,471 కోట్లగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంపై (రేపు) గురువారం శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. శాసనసభ ఇప్పటికే ఆమోదించిన పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణల బిల్లులపై మండలిలో చర్చ చేపడతారు. అవయవదానానికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈరోజు మండలిలోనూ ప్రవేశపెట్టనుంది. ఉభయసభల్లో నేడు కూడా ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. అయితే నేడు కొనసాగుతోన్న తెలంగాణ శాసనసభలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. పనులు కావాలంటే కాంగ్రెస్ నేతలు 30 శాతం కమిషన్లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ సభ్యులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి విక్రమార్క హెచ్చరించారు. దీనిపై బిఆర్‌ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఇటు కాంగ్రెస్, అటు బిఆర్‌ఎస్ సభ్యుల ఆందోళనతో సభలో వాతావరణం వేడెక్కింది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. లేదంటే సభలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
