గిరిజన ప్రాంతాలను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర

  • అల్లూరి జిల్లాను రూథర్‌ఫర్డ్‌ జిల్లాగా మార్చేస్తారేమో!
  • 13న సమైక్యతా శంఖారావం సభకు మద్దతు
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
  • భారత ఆత్మగౌరవాన్ని మోడీ అమెరికాకు తాకట్టు పెట్టారని వ్యాఖ్య

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గిరిజన ప్రాంతాలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను రూథర్‌ఫర్డ్‌ జిల్లాగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రంపచోడవంలో ఐటిడిఎ బుధవారం వర్క్‌షాపు నిర్వహించిందని, ఈ కార్యక్రమానికి జర్నలిస్టులను, మీడియాను కూడా రానివ్వకుండా అడ్డుకుందన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు, నాయకులతో మాట్లాడించి ఒక నోట్‌ తయారు చేసి విడుదల చేసినట్లు చెప్పారు. అభివద్ధి, టూరిజం మాటున ఏజన్సీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడమే దీని వెనుకనున్న మర్మమన్నారు. ఈ ప్రక్రియ గత రెండు మూడు నెలల నుంచి కొనసాగుతుందన్నారు. గతంలో శాసన సభ స్పీకర్‌ అయన్నపాత్రుడు 1/70 చట్టానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, గత శాసన సభ సమావేశాల్లో టిడిపి ఎమ్మెల్యేతో గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులకు ఇళ్ల స్థలాలు కేటాయించాని కోరుతూ ప్రకటన చేయించడం, తాజాగా గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ టూరిజం ప్రోత్సహించాలని చేసిన వాఖ్యలు ఇందులో భాగమేనన్నారు. గత ఎన్నికల్లో గిరిజన చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చిన టిడిపి కూటమి, ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందన్నారు. షెడ్యూల్‌ ప్రాంతాల్లో భూములు కేటాయించాలంటే పెసా చట్టం ప్రకారం గ్రామ సభ అనుమతి అవసరమని తెలిపారు. గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో గిరిజన సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. టిఎసి అనుమతి లేకుండా గిరిజన ప్రాంతంలో భూములను కేటాయించేందుకు అవకాశం లేదన్నారు. ఈ నిబంధనలను పాటించకుండా ఏకపక్షంగా ప్రభుత్వం భూములు కేటాయింపు విషయంలో ముందుడుగు వేస్తోందన్నారు. అభివద్ధి పేరుతో గిరిజనుల హక్కులను హరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. గిరిజనుల ఉనికిని దెబ్బతీస్తూ, ఏజెన్సీ ఏరియాపై కార్పొరేట్‌ ఆధిపత్యం తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలను తిరస్కరించి, ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కారణంగా రంప చోడవరంలో 7 మండలాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయని, వీరికి ఎటువంటి పునరావాసమూ కల్పించలేదన్నారు. మరోవైపు అదానీ, గ్రీన్‌కో లాంటి సంస్థలకు 5 పంప్డ్‌ స్టోరేజి పవర్‌ ప్రాజెక్టులు కేటాయించారని తెలిపారు. దీంతో ఏజెన్సీ ప్రాంతం అంతా సర్వనాశనం అవుతుందని, గిరిజనుల ఉనికే దెబ్బతిటోందన్నారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగం అధికంగా ఉందని, చదువుకున్న గిరిజనులకు ఉద్యోగాలు లేవని చెప్పారు. జిఒ 3 పునరుద్ధరించడానికి చంద్రబాబు చేసిన వాగ్దానం మరిచిపోయారన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ తన పర్యటనలో జిఒ 3, షెడ్యూల్‌ 5, నిరుద్యోగం, ఇతర సమస్యల గురించి ప్రస్తావించకుండా కేవలం టూరిజం గురించి మాత్రమే చెప్పడాన్ని తప్పుబట్టారు. రంపచోడవరం వర్క్‌షాపులో టూరిజం అభివద్ధి చెందితే హౌటల్స్‌లో బార్సు ఉద్యోగాలు గిరిజనులకు వస్తాయని చెప్పడం అర్ధరహితమన్నారు. చదువుకున్న గిరిజన యువకులు హౌటల్స్‌లో బారుగా పని చేయాలని చెబుతున్నారని, అభివద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. గిరిజనుల భూములపై వారి హక్కులను లాగేసుకుని వారిని జీతగాళ్ళుగా మార్చనున్నారని తెలిపారు. ఈ ప్రయత్నాన్ని స్థానికులు తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం లోపాయికారీ విధానాలు మానుకొని ఆదివాసీలకు కల్పించిన రాజ్యాంగ హక్కులు కాపాడాలని కోరారు. గతంలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని ఆయన గుర్తు చేశారు. గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసి, వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని, పెసా చట్టం ప్రకారం గ్రామ సభలు నిర్వహించి గిరిజనుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతంలోకి కార్పొరేట్‌ సంస్థలను అనుమతించి భూగర్భసంపద కొల్లగొట్టుకుపోయే విధానాలను ప్రజలు తిరస్కరించాలని కోరారు.

ట్రంప్‌ టారిఫ్‌ యుద్దంపై మాట్లాడుతూ దేశ ఆత్మగౌరవాన్ని అమెరికాకు ప్రధాని నరేంద్రమోడీ తాకట్టపెట్టారని ఆగ్రహం వెలిబుచ్చారు. పేరుకు రోజూ దేశ భక్తి గురించి మాట్లాడుతున్నారని అన్నారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు విన్నవారెవరికైనా ఆగ్రహావేశాలు కలుగుతాయని చెప్పారు. భారత్‌ సహా అన్ని దేశాలను బూతులు తిడుటుంటే కనీసం ఆత్మగౌరవం గల దేశం స్పందించదా, ఇది భరత మాతను తాకట్టు పెట్టడం కాదా అని ప్రశ్నించారు. చర్చలు జరుపుతున్నామని, మనకే ఎక్కువ లాభమని విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌ చెప్పడాన్ని తప్పుబట్టారు. సుంకాలపై 90 రోజులు మినహాయింపు ఇస్తే దేశానికి ఉపశమనం కలుగుతుందా అని ప్రశ్నించారు. అమెరికా పెంచిన సుంకాల వల్ల ఆక్వా, వ్యవసాయం, జౌళి రంగాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. తాజాగా ఫార్మా రంగంపైనా సుంకాలు పెంచనున్నట్లు అమెరికా ప్రకటించిందని తెలిపారు. ఈ సుంకాలను ఎదుర్కొవడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధపడటం లేదో చెప్పాలన్నారు. దేశభక్తి గల ప్రభుత్వం అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా ఉన్న అన్ని దేశాలను కలుపుకుని పోరాటం చేయాలన్నారు. మోడీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదని నిస్సిగ్గుగా లొంగుబాటు ప్రదర్శస్తుందని చెప్పారు. రైతులు, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలను తాకట్టుపెట్టి దెబ్బతీయాలని ప్రయత్నిస్తోందన్నారు. ఇప్పటికే అధిక ధరలు చెల్లించి అమెరికా నుంచి పెట్రోల్‌ డీజిల్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారల్‌కు 60 నుంచి 75 డాలర్ల లోపు ధరలు తగ్గితే దేశంలో పెట్రోల్‌ డిజిల్‌ ధరలు తగ్గించకుండా ఎక్సైజ్‌ డ్యూటీ పేరుతో పన్నులు విధించి కేంద్రమే తన ఖజానాలో వేసుకుటుందని తెలిపారు. ఈ విధంగా రూ.38 వేల కోట్లు కొల్లగొడుతోందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లీటరుకు రూ.2 తగ్గించాలని, పెంచిన గ్యాస్‌ ధర రూ.50ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.
సొసైటీ ఫర్‌ కమ్యూనల్‌ హార్మొని సంస్థ ఈ నెల 13వ తేదీన విజయవాడలో సమైక్యతా శంఖారావం నిర్వహిస్తుందని దీనికి సిపిఎం పూర్తి మద్దతు తెలియజేస్తోందన్నారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమైనందున జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

➡️