- హైబ్రిడ్ మోడల్ సరికాదు
- మాజీ మంత్రి విడదల రజని
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందకుండా చేసేందుకు టిడిపి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి విడదల రజని ఆరోపించారు. గుంటూరులోని తన నివాసంలో ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని తెలిపారు. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, పథకాన్ని యథాతథంగా కొనసాగేలా చూడాలని కోరారు. ఆరోగ్యశ్రీలో మార్పు ఏ మాత్రమూ సరికాదన్నారు. పేదలు అనారోగ్యం పాలైతే మానవతా దృక్పథంతో ఆదుకోవాలే తప్ప ట్రస్ట్ మోడల్‌లో ఉన్న ఆరోగ్యశ్రీని హైబ్రిడ్ మోడల్‌లోకి మార్చడం తగదన్నారు. 2014 నుంచి 2019 వరకు కేవలం 1059 వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించగా.. 2019 నుంచి 2024 వరకు 3257 వ్యాధులకు చికిత్స అందించామని తెలిపారు. పథకంలో కవరేజ్‌ను రూ.25 లక్షల వరకు పెంచినట్లు చెప్పారు. 2019లో టిడిపి ప్రభుత్వం రూ.632 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిపోగా తమ ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఏకంగా రూ.3 వేల కోట్లు బకాయి పెట్టడంతో.. అవన్నీ వైద్యాన్ని నిలిపేశాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. హైబ్రిడ్ మోడల్‌తో ఇన్సూరెన్స్ కంపెనీలకే లాభమని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.