- సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
- ముస్లిము సంఘాల డిమాండ్
ప్రజాశక్తి – కోడుమూరు రూరల్ : వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో ముస్లిములు నిరసన ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ షాదిఖానా నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుభాన్, గ్రామీణ ప్రాంతాల ముస్లిము సోదరులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సుభాన్, ముస్లిము మైనారిటీ నాయకులు ఇంతియాజ్‌బాష, ముఫ్తి మన్సూర్ సాబ్, హఫీస్, అజీమ్ మాట్లాడారు. ఎన్నికల ముందు ‘సబ్‌కా వికాస్ సబ్‌కా సాత్’ అని చెప్పిన బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లిము మైనారిటీలపై దాడులు చేస్తోందని విమర్శించారు. ఇందుకు ఎన్‌ఆర్‌సి, యుసిసి, ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు వంటివి ఉదాహరణ అని చెప్పారు. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న వక్ఫ్ బోర్డును రద్దు చేసి ముస్లిముల మనోభావాలను దెబ్బతీసిందని, వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వానికో లేదా ఏ సంస్థకో చెందినవి కావని, ముస్లిముల అభివృద్ధి కోసం పూర్వీకులు దానధర్మాలు చేసి ఇచ్చిన ఆస్తులని స్పష్టం చేశారు. ఈ ఆస్తులపై బిజెపి ప్రభుత్వం కన్నేసిందని, సవరణ పేరుతో వాటిని దోచుకోవాలని కుట్ర పన్నుతోందని తెలిపారు. ఈ చట్టానికి మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ముస్లిములకు రక్షణగా ఉంటామని ఎన్నికలకు ముందు చెప్పి, ఇప్పుడు వెన్నుపోటు పొడవడం బాధాకరమని అన్నారు. స్వాతంత్య్రం కోసం ఎంతోమంది ముస్లిము పండితులు, ఉలమాలు, మేధావులు ప్రాణాలర్పించారని, ఆ చరిత్రను బిజెపి ఒకసారి చదువుకోవాలని సూచించారు. ఇప్పటికే కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ వెంకటేష్ నాయక్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆఫీజ్ అజీమ్ సాబ్, అప్సరఫారూఖ్, ఆవాజ్ కమిటీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ముస్తఫా, ఆఫీస్ హాజీ సాబ్, సాజిద్ అలీ, మాఖబుల్ మౌలానా రహంతుల్లా, షఫీ అమీర్ సాబ్, ఆవాజ్ నాయకులు ఆర్ ఖాజా, మహమ్మద్, ముతవల్లి బషీర్ భారు, గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లిము సోదరులు పాల్గొన్నారు.