- డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన ధర్నాలో రామన్న
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించి దేహదారుఢ్య పరీక్షలు, మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించాలని, హోంగార్డు రిజర్వేషన్లు తగ్గించి పాత పద్ధతిలోనే భర్తీ చేయాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం ధర్నా చౌక్‌లో కానిస్టేబుల్ అభ్యర్థులందరూ డిఐఎఫ్‌ఐ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోలీసు కానిస్టేబుల్ నోటిఫికేషన్లో 95,208 మంది పోలీసు అభ్యర్థులు ప్రాథమిక పరీక్ష రాసి అర్హత సాధించారని తెలిపారు. వీరికి తర్వాత జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు, మెయిన్స్ రాత పరీక్షలు ఇప్పటి వరకూ నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఏదైతే హోంగార్డులకు రిజర్వేషన్లు, సివిల్ 8 నుండి 15 శాతం, ఎపిపిఎస్‌సి 15 నుంచి 25 శాతానికి పెండచం వల్ల నిరుద్యోగులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. భవిష్యత్‌లో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కుట్ర జరుగుతోందని అన్నారు. హోంగార్డులు తమ పోస్టులు తమకు కావాలని హైకోర్టుకు వెళ్లగా వారికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. దీనివల్ల ఇంతకముందు పాత రిక్రూట్‌మెంట్లో స్పెషల్ రిక్రూట్‌మెంట్లో రిజర్వేషన్లకు కేటాయించిన పోస్టుల్లో అర్హత సాధించిన వారికి ఇచ్చి మిగిలినవి జనరల్ అభ్యర్థులకు ఇచ్చేవారని పేర్కొన్నారు. ఈ తీర్పు వల్ల అది సాధ్యం కాదని, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో హోంగార్డు రిజర్వేషన్లు పెంచడం వల్ల జనరల్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని భావించి మార్కులతో సంబంధం లేకుండా తీసుకోవాలని ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేశారని తెలిపారు. దాదాపు నాలుగు వాయిదాలు జరిగినప్పటికీ ఈ కేసును గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రెండు సంవత్సరాలు కాలయాపన జరిగిందన్నారు. దీనివల్ల పోలీసు అభ్యర్థులు పూర్తిగా నష్టపోయారని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం న్యాయం చేస్తుందనుకున్నా తరువాత పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం కూడా విచారణకు హాజరుకావడం లేదని వివరించారు. యువగళం పాదయాత్రలో కానిస్టేబుళ్ల అభ్యర్థులకు న్యాయం చేస్తామని హామీనిచ్చినా అమలు చేయలేదని పేర్కొన్నారు. అలాగే టిడిపి కార్యాలయంలో రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కూ వినతిపత్రం ఇచ్చామని పేర్కొన్నారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రాము అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు, కృష్ణ, అభ్యర్థులు నాగార్జున, కిరణ్, శ్రీనునాయక్, శ్వేత తదితరులు పాల్గొన్నారు.