- కూటమి ప్రభుత్వ రాకతో ప్రజాస్వామ్యానికి పునరుజ్జీవనం
- సిఎం చంద్రబాబునాయుడు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే రక్ష అని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. అరాచక శక్తులు అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ప్రజలు రాజ్యాంగం ఇచ్చిన ఓటు అనే ఆయుధంతో బుద్ది చెబుతారని చెప్పారు. భారత రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సాంఘిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలనేది రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. రాజ్యాంగ రచనలో నీలం సంజీవరెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు, ఆచార్య ఎన్‌జి రంగా, దుర్గాబారు దేశ్‌ముఖ్ వంటి 11 మంది తెలుగు వారు కీలకపాత్ర పోషించారన్నారు. దేశం గర్వించేలా జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారని గుర్తు చేశారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసే వ్యక్తులు చెడ్డవారైతే దానివల్ల సమాజానికి చెడ్డే జరుగుతుందని అంబేద్కర్ చెప్పారని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలే తప్ప వ్యక్తిగత స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించకూడదన్నారు. గత ఐదేళ్లలో జిఒలను రహస్యంగా ఉంచారని, తాము అధికారంలోకి రాగానే పారదర్శకంగా అన్ని జీఓలను ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని సిఎం వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్‌లో భాగంగా రాష్ట్రంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికను రూపొందించామన్నారు. అప్పటికి దేశం, ప్రపంచంలోనూ తెలుగు వారు మొదటి స్దానంలో ఉండాలని, రాష్ట్రాన్ని సంపన్న, ఆరోగ్య, సంతోషకర రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ ఆశయమని అన్నారు. అందరిచేత రాజ్యాంగ పీఠిక పఠనం చేయించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, బాలవీరాంజనేయస్వామి, ఎస్ సవిత, పి.నారాయణ, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, బిసి జనార్ధన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఫ్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కృష్ణబాబు, అనంతరాము, ముఖ్య కార్యదర్శులు ముకేష్‌కుమార్ మీనా, శశిభూషణ్‌కుమార్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, పలువురు అధికారులు పాల్గొన్నారు.