హిందూస్థాన్‌ షిప్‌ యార్డ్‌లో ఫ్లీట్‌ సపోర్టు నౌకల నిర్మాణం చేపట్టాలి

May 15,2024 20:36 #ch narasingarao, #CITU
  • మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదో సమాధానం చెప్పాలి
  • సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు డిమాండ్‌

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : రక్షణ రంగానికి అవసరమైన ఐదు ఫ్లీట్‌ సపోర్టు నౌకలను సుమారు రూ.20 వేల కోట్లతో నిర్మించడానికి విశాఖలోని హిందూస్థాన్‌ షిప్‌యార్డుకు కేంద్రం ఆర్డరు ఇచ్చిందని, వాటిలో రెండింటిని రాజకీయ ఒత్తిళ్లతో ఎల్‌అండ్‌టి కంపెనీకి ఇవ్వడాన్ని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు తీవ్రంగా ఖండించారు. ఈ చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. జగదాంబ సమీపంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ షిప్‌యార్డుకు పూర్వవైభం తెచ్చే వర్కు ఆర్డర్లు వచ్చినప్పటికీ వాటిని ఎల్‌ అండ్‌ టి కంపెనీకి నామినేషన్‌ పద్ధతిలో అప్పగించడం ప్రమాదకరమన్నారు. దేశంలో విశాఖ షిప్‌యార్డుకు సహజ సిద్ధమైన యార్డు, డైడాక్‌లున్నాయన్నారు. గతంలో 7500 మంది పర్మినెంట్‌ నైపుణ్య కార్మికులు పనిచేసిన చరిత్ర ఉందని, 82 వసంతాలు పూర్తి చేసుకున్న మొట్ట మొదటి నౌక నిర్మాణ సంస్థ హిందుస్థాన్‌ షిప్‌ యార్డ్‌ లిమిటెడ్‌ అని వివరించారు. ఇప్పటికీ సుమారు 200కు పైబడి విభిన్న నౌకల నిర్మాణం చేసిన ఘనత షిప్‌యార్డ్‌కు ఉందని గుర్తుచేశారు. విశాఖ హిందూస్థాన్‌ షిప్‌యార్డును బలహీనపరిచే విధంగా సిఎండి హేమంత్‌ ఖత్రీ నిర్ణయాలు తీసుకోవడం షిప్‌యార్డు అభివృద్ధికి ఆటంకన్నారు. రెండేళ్ల క్రితం స్లిప్‌వే మౌలిక సదుపాయాలు కల్పించేందుకు యాజమాన్యం రూ.ఐదు వేల కోట్లు బ్యాంకు రుణాలు తీసుకుందని గుర్తు చేశారు. అయినప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా నేటికీ చర్యలు తీసుకోలేదని, వడ్డీలు మాత్రం ప్రతినెలా బ్యాంకులకు చెల్లిస్తోందన్నారు. ఎల్‌అండ్‌టికి ఐదు ఫ్లీట్ల నౌకల నిర్మాణం అప్పగించడానికి సిఎండి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. గత రెండేళ్ల నుంచి ఫ్లీట్‌ సపోర్టు నౌకల నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదో సిఎండి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత 20 సంవత్సరాలలో వచ్చిన భారీ వర్క్‌ ఆర్డర్‌ను షిప్‌యార్డు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నదో సిఎండి సమాధానం చెప్పాలన్నారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ ఐదు షిప్పులను షిప్‌యార్డులోనే నిర్మాణం చేయాలని, ఎల్‌అండ్‌టి, ఎస్‌ఇడిఎస్‌ కొచ్చిన్‌కు, అలాగే ఫిన్కాంటియరీ సంస్థకు ఇచ్చిన ఆర్డర్లను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌, ఉపాధ్యక్షులు కెఎం కుమారమంగళం పాల్గొన్నారు.

➡️