బిపిసిఎల్‌ లైన్‌ నిర్మాణ పనులు అడ్డగింత

Sep 30,2024 00:20 #BPCL, #construction, #line blocked, #work
  • రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
  • రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కష్ణయ్య డిమాండ్‌

ప్రజాశక్తి-సంతనూతలపాడు (ప్రకాశం జిల్లా) : రైతులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పైపులైన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామంలో బిపిసిఎల్‌ పైపు పనులను రైతులు అడ్డుకున్నారు. ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఈ పనులను నిలుపుదల చేయించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు మాట్లాడుతూ సెంటుకు రూ.25 వేల వంతున రైతులకు నష్ట పరిహారం చెల్లించి పైపు లైన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. బిపిసిఎల్‌ పైపులైనుకు 16 మీటర్లు వెడల్పుతో భూమి అవసరం ఉన్న విషయాన్ని రైతులకు చెప్పడంలేదని పైపులైను వేసుకున్న తర్వాత ఎప్పటిలాగా వ్యవసాయం చేసుకోవచ్చని మాత్రమే చెప్తున్నారని అన్నారు. రైతులకు పంట నష్టంతో కలిపి పూర్తి నష్టపరిహారాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గతంలో పల్నాడు జిల్లా కలెక్టర్‌ అక్కడి రైతులకు పంట నష్టంతో సహా పూర్తి నష్టపరిహారం చెల్లించి పైపులైను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. పేర్నమిట్ట గ్రామంలో చెరువులోపల నుంచి బయటకు పైపులైన్‌ వేయాలని రైతులు పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కిలారి పెద్దబ్బాయి, అన్ను సుబ్బారావు, కరిచేటి హనుమంతరావు, భత్తుల సుబ్బారావు, గుండవరపు రామయ్య, ఆళ్ల అంజయ్య, మైనంపాడు గ్రామ రైతులు పాల్గొన్నారు.

➡️