ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, సిఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటైంది. ఫోరం ఛైర్మన్‌గా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, వైస్ ఛైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన జిఓ 58ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ విడుదల చేశారు. రెండేళ్ల కాలపరిమితితో ఈ ఫోరం పనిచేయనుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించనుంది. ఈ కమిటీలో సభ్యులుగా మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఇంధన, ఆర్థిక, రోడ్లు, భవనాలు, జలవనరులశాఖ, పరిశ్రమలు-వాణిజ్య, జిఎడి, పర్యాటక, ఐటి-ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖల ముఖ్యకార్యదర్శులు ఉంటారు. వీరితోపాటు ఎపి ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సిఇఒ, భారత పరిశ్రమల సమాఖ్య ఎపి కౌన్సిల్ ఛైర్మన్ మెంబర్ కన్వీనర్‌గా, వైస్ ఛైర్మన్, కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.