- వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అన్ని రకాల ఉపయుక్తమైన మొక్కజొన్నకు నిరంతరం డిమాండు ఉందని వ్యవసాయశాఖ సంచాలకులు ఢిల్లీరావు తెలిపారు. మొక్కజొన్నసాగు, దిగుబడి, మార్కెటింగ్ తదితర అంశాలపై బుధవారం విజయవాడలో గుంటూరు, బాపట్ల, అనంతపూరు, సత్యసాయి నంధ్యాల కర్నూలు, ఏలూరు, ఎన్‌టిఆర్, శ్రీకాకుళం జిల్లాల్లో ఎంపిక చేసిన రైతులు, ఔత్సాహికులతో వర్కుషాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీరావు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా మొక్కజొన్నకు ఎగుమతుల్లోనూ, దేశీయంగా వినియోగంలోనూ డిమాండు పెరుగుతోందని పేర్కొన్నారు. వాహన రంగంలో వాడే పెట్రోల్‌లో ఇథనాల్‌ను తప్పనిసరిగా 20శాతం కలపాలని ఇచ్చిన కేంద్ర ఆదేశాల మేరకు మొక్కజొన్న డిమాండు మరింత ఎక్కువైందని అన్నారు. రాబోయే కాలంలో దీన్ని 50 శాతానికి పెంచే అవకాశం ఉందని తెలిపారు. పరిశోధన సంచాలకులు డాక్టర్ పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలో మొక్కజొన్న సాగు ప్రపంచ మొక్కజొన్న విస్తీర్ణంలో నాలుగోస్థానంలో ఉందని పేర్కొన్నారు. ఉత్పత్తిలో ఏడో స్థానంలో ఉందని తెలిపారు. మొక్కజొన్న పంట 10 డిగ్రీల ఉష్ణోగ్రత నుండి 36 డిగ్రీల ఉష్ణోగ్రత వరకూ పండగలదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు చంద్రమోహన్‌రెడ్డి, రామభద్రరాజు, ప్రసాదు, విజయభారతి, బాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు.