ఐటి హబ్‌లకు సహకారం అందించండి

  • మైక్రో సాఫ్ట్‌ సిఇఒ సత్య నాదెళ్లతో లోకేష్‌ భేటీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఐటి హబ్‌లు, ఇన్నోవేషన్‌ పార్కులను నిర్మిస్తున్నామని, వీటికి ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్‌ సహకారం అవసరమని ఆ సంస్థ సిఇఒ సత్య నాదెళ్లను విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌శాఖల మంత్రి నారా లోకేష్‌ కోరారు. అమెరికా పర్యటనలో భాగంగా సత్య నాదెళ్లతో మంగళవారం భేటీ అయ్యారు. క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, డేటా సెంటర్ల ఏర్పాటుతో రాష్ట్రం ప్రపంచస్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని లోకేష్‌ వివరించారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, భూమి తమ వద్ద అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. క్లౌడ్‌సేవల్లో మైక్రోసాఫ్ట్‌ నాయకత్వంతో కలిసి తాము అత్యాధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. అగ్రిటెక్‌కు ఎఐని అనుసంధానించడం వల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ) ప్రాజెక్టులకు అనువుగా ఉన్న అమరావతిని ఎఐ క్యాపిటల్‌గా తయారుచేయాలని భావిస్తున్నామని చెప్పారు. వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆవిష్కరణల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు, సాంకేతిక పర్యావరణ వ్యవస్థను వచ్చి పరిశీలించాలని కోరారు. యాపిల్‌ సంస్థ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు రాష్ట్రం అనువైన ప్రదేశమని యాపిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రియా సుబ్రహ్మణ్యంతో లోకేష్‌ అన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రియా సుబ్రహ్మణ్యంతో లోకేష్‌ భేటీ అయ్యారు. భారత్‌లో యాపిల్‌ కార్యకలాపాల విస్తరణకు అవసరమైన మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆడోబ్‌ ఆర్‌అండ్‌డి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అడోబ్‌ సిఇఒ శంతను నారాయణను లోకేష్‌ కోరారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో శంతను నారాయణతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం సభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్‌ వర్మ ఉన్నారు.

➡️