పోలింగ్‌ పూర్తయినా.. ఆగని టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య వివాదం

May 14,2024 13:01 #chittur‚, #controversy, #TDP and YCP

అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ పూర్తయినా.. వైసిపి అరాచకాలు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలోని పలుచోట్ల టిడిపి ఏజెంట్లు, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగుతున్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులో టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. రాత్రి పోలింగ్‌ బూత్‌ వద్ద ఘర్షణ చోటు చేసుకోగా.. దానికి కొనసాగింపుగా మంగళవారం ఉదయం మళ్లీ వైసిపి నేతలు గొడవకు దిగారు. శావల్యాపురం మండలం పేరూరుపాడులో వైసిపి నేతలు అరాచకానికి ఒడిగట్టారు. టిడిపికు చెందిన వారి కార్లు ధ్వంసం చేశారు.
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం బాపలనత్తంలో టిడిపి ఏజెంట్లు బాబు, నందగోపాల్‌పై వైసిపి వర్గీయులు కత్తులు, రాళ్లతో దాడి చేశారు. అడ్డుకోబోయిన కేశవులు అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని తిరుపతిలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతపురం జిల్లా కొత్తూరులో టిడిపి కుటుంబాలపై వైసిపి కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు మహిళలకు గాయాలయ్యాయి. వీరిని కల్యాణదుర్గం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. అక్కడికి వెళ్లి మరోసారి వైసిపి మూకలు విచక్షణ రహితంగా దాడులు చేశాయి. టిడిపికు ఓటు వేశారన్న ఆక్రోశంతోనే దాడి చేసినట్లు బాధితులు వాపోతున్నారు.

➡️