సిఎంకు సిపిఎం విజ్ఞప్తి
విస్తృత సమావేశంలో తీర్మానం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విశాఖ స్లీలు ప్లాంటు ప్రైవేటీకరణను నిలుపుదల చేసేందుకు ప్రధానమంత్రిని ఒప్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఎం విజ్ఞప్తి చేసింది. రెండు రోజులపాటు వడ్డేశ్వరంలోని సుందరయ్య స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లో జరిగిన సిపిఎం రాష్ట్ర విస్తృత సమావేశాలు శనివారం ముగిశాయి. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.ఏ బేబి, బి.వి రాఘవులు హాజరైన ఈ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయబోమని కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ తీర్మానంలో కోరారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు కేంద్రంపై ఒత్తిడి చేయాలని సూచించారు. స్టీల్‌ప్లాంట్ పోరాట కమిటీ కృషి వల్ల నేటికి ఒక్క శాతం కూడా ప్రైవేటు కాకుండా ప్లాంటు నడుస్తోందని తెలిపారు. రెండేళ్ల నుండి ఉత్పత్తి తగ్గించి విశాఖ స్టీల్‌ను నష్టాలకు నెడుతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసినా కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా చేసే హానికరమైన చర్యలను ఏ మాత్రం అడ్డుకోలేదని తీర్మానంలో పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికల ముందు, తరువాతా తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి విశాఖ స్టీల్‌ను ప్రైవేటు కాకుండా కాపాడుతామని ప్రకటించిందని అయితే, ఇటీవల ఢిల్లీ వెళ్లిన సిఎం కేంద్రానికి సమర్పించిన వినతుల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రస్తావన లేకపోవడం చర్చనీయాంశంగా మారిందని తెలిపారు. జూలై 11వ తేదీన ప్లాంటును సందర్శించిన కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమార స్వామి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సమర్ధవంతంగా నడిపే అవకాశాలున్నాయని, ఒకటిన్నర నెలలో తగిన నిర్ణయాలు తెలియజేస్తామని పోరాట కమిటీ నాయకులకు చెప్పారనిపేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 32 మంది ప్రాణాలను బలిదానం చేసి సాధించుకున్న ఏకైక భారీ పరిశ్రమని, అవసరమైతే ప్రాణాలర్పించి అయినా విశాఖ స్టీల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాపాడుకుంటారని తీర్మానంలో పేర్కొన్నారు. అత్యంత సమర్ధవంతమైన స్టీల్‌ప్లాంట్‌ను దెబ్బతీసే బిజెపి చర్యలను వెంటనే విరమించుకోవాని, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ను సమర్ధవంతంగా నడపడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. ఈ తీర్మానాన్ని ఆర్‌కె ఎస్‌వి కుమార్ ప్రతిపాదించారు.
‘ఉపాధి’ పని దినాలు, వేతనాలు పెంచాలి
ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందామని మరో తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. పనిదినాలు, వేతనాలు పెంచాలని ఈ తీర్మానంలో కోరారు. ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి కేంద్ర బడ్జెట్‌లో రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించి పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేయాలని తీర్మానించింది. దీన్ని కె.శివనాగరాణి ప్రతిపాదించారు.
పారిశ్రామిక ప్రమాదాలు అరికట్టాలి
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రమాదాలు అరికట్టాలని మరో తీర్మానంలో పేర్కొన్నారు. పరిశ్రమల్లో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ముఖ్యంగా ఫార్మా, సిమెంట్, రసాయన పరిశ్రమల్లో ఒకవైపున ఆధునీకరణ పెరిగినా గతం కంటే ప్రమాదాలు పెరిగాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని, యాజమాన్యాలు లాభాపేక్షతో కనీసమైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, కార్మికులు ప్రాణాలు పణంగాపెట్టి పనిచేస్తున్నారని తెలిపారు. యాజమాన్యాలకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం ఈజ్‌ఆఫ్‌డూయింగ్ విధానాన్ని పాటిస్తోందని, పరిశ్రమలో తనిఖీలు ఆపివేసిందని, దీంతో యాజమాన్య నిర్లక్ష్యం తారాస్థాయికి చేరిందని వివరించారు. భద్రతా చర్యలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని ఎన్‌సిహెచ్ శ్రీనివాస్ ప్రతిపాదించారు.