- రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఒక వైపు తీవ్ర ఎండలు, వడగాడ్పులు బెంబేలెత్తిస్తుంటే మరోవైపు అకాల వర్షాలు అన్నదాతలను కడగండ్ల పాల్జేస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న ఈ భిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు, భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతు న్నాయని, మరోవైపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని, ఈ పరిస్థితుల్లో ప్రజలు ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న మూడు రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ నెల 15న మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు తెలిపారు.