రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌తో సమన్వయం

  • త్వరలో అందుబాటులోకి వాట్సాప్‌ గవర్నెన్స్‌
  •  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రభుత్వంలోని వివిధ శాఖలు, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్‌టిజిఎస్‌)కు సాంకేతిక సహకారాన్ని అందించాలని, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌తో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ పేర్కొన్నారు. సిఎం చంద్రబాబు ఆలోచనా ధోరణికి అనుగుణంగా ఈ సంస్థ పనిచేసి మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు. సచివాలయంలోని ఆర్‌టిజిఎస్‌ కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాంకేతిక యుగంలో ప్రభుత్వ శాఖల్లో మెరుగైన ఫలితాలు రాబట్టడానికి అవకాశాలు అపారంగా ఉన్నాయన్నారు. ఆర్‌టిజిఎస్‌ను ప్రభుత్వంలో సాంకేతికపరంగా ఒక కటింగ్‌ ఎడ్జ్‌గా ఉండాలనేది సిఎం ఆశయమన్నారు. ఆర్‌టిజిఎస్‌ కార్యకలాపాలను తాను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానన్నారు. పౌరులకు, ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలనే సదాశయంతో సిఎం వాట్సాప్‌ గవర్నెన్స్‌కు సంబంధించి పనులు ఎంతమేరకు వచ్చాయని ఆర్‌టిజిఎస్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్‌టిజిఎస్‌ సిఇఒ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. వాట్సాప్‌ గవర్నెన్స్‌కు సంబంధించి అన్ని పనులు దాదాపు పూర్తి చేశామన్నారు. ఇందుకు సంబంధించిన డెమోను సిఎస్‌కు చూపించారు. ఫిర్యాదులు కూడా వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా చేసే వీలు కల్పిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆర్‌టిజిఎస్‌ డిప్యూటీ సిఇఒ ఎం మాధురి పాల్గొన్నారు.

➡️