తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలవరం…!

Dec 22,2023 12:37 #Corona, #panic, #Telugu states

అమరావతి : తెలుగు రాష్ట్రాలను ‘కొత్త’ కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ఎపిలో తాజాగా 2 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి కొవిడ్‌ కేసు నమోదైంది. 85 ఏళ్ల వృద్ధురాలికి కొవిడ్‌ సోకినట్లు సమాచారం. అప్రమత్తమైన వైద్యాధికారులు శాంపిల్‌ను జీనోమ్‌ సీక్వెన్స్‌ ల్యాబ్‌కు పంపించారు. ఏలూరులోని ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ వైద్యునికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. వేరియంట్‌ నిర్ధారణ కోసం శ్వాబ్‌ను హైదరాబాద్‌ జినోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు పంపారు. అయితే, ఆందోళన చెందాల్సిన పని లేదని పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని డీఎం అండ్‌ హెచ్‌ఓ తెలిపారు. పాజిటివ్‌ వ్యక్తి వేరే ఇతర రాష్ట్రాలకు ఎక్కడా ప్రయాణం చేయలేదని స్పష్టం చేశారు.

తెలంగాణలో…

తాజాగా హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులు కరోనా బారినపడ్డారు. నాలుగైదు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. 14 నెలల చిన్నారికి కరోనా సోకింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 కోవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా వ్యాప్తితో ఎంజీఎం సిబ్బంది అప్రమత్తమయ్యారు. మాస్క్‌ లేనిదే ఆసుపత్రిలోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు. కోవిడ్‌ పేషెంట్లకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

అప్రమత్తమైన ఎపి వైద్య ఆరోగ్య శాఖ…

కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌ 1పై కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో … ఎపిలోనూ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో కొత్తగా 2 కేసులు వెలుగుచూడడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో ఉన్న విలేజ్‌ క్లినిక్స్‌ అన్నింటికీ యాంటీజెన్‌ టెస్ట్‌ కిట్స్‌ ఇప్పటికే అందజేశామని, అక్కడ ఏదైనా పాజిటివ్‌ నిర్ధారణ అయితే, దానిని ఆర్టీపీసీఆర్‌ టెస్టుకు పంపేందుకు వీలుగా రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలల్లో పరీక్షలకు అవసరమైన సౌకర్యాలు సిద్ధంగా ఉంచామన్నారు. అక్కడ కూడా కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలితే విజయవాడలోని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపి వేరియంట్‌ను గుర్తించి వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

➡️