ఆలపాటి కుటుంబ ఆస్తి రూ.35.75 కోట్లు
వివాదంలో ఉన్న ఆస్తులు మరో రూ.120 కోట్లు
పిడిఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఆస్తులు రూ.1.56 కోట్లు
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పోటీ సిట్టింగ్ ఎమ్మెల్సీ, పిడిఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకు, టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు మధ్య జరగనుంది. గుంటూరులో కార్పొరేట్ దిగ్గజంగా పేరొందిన టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు భారీగా ఆస్తులు ఉన్నాయి. ఈ మేరకు ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. స్థలాలు, పొలాలు, నివాసాలు, వ్యాపార సంస్థల్లో షేర్లు, ఇతర ఆస్తులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరున రూ.14.79 కోట్లు ఉన్నాయి. ఆయన భార్య మాధవి పేరున రూ.20.96 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు చూపారు. అంతేగాక వీరిద్దరి పేరునా మరో రూ.120 కోట్ల విలువైన ఆస్తులు కోర్టు వివాదంలో ఉన్నట్టు పేర్కొన్నారు. పలు కార్పొరేట్ సంస్థలు ఆయన అధీనంలో ఉన్నాయి. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి, ఎన్‌ఐఆర్ ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలు, గ్రాండ్ నాగార్జున హోటల్, ఎన్‌ఆర్‌ఐ అగ్రీ టెక్ వంటి కార్పొరేట్ సంస్థల్లో ఆయనకు, ఆయన భార్యకు షేర్లు ఉన్నాయి. టిడిపిలో దాదాపు 40 ఏళ్లుగా వివిధ హోదాల్లో పనిచేసిన ఆయనకు గత ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో ఈసారి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది.
ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. హిందూ కళాశాలలో అధ్యాపకునిగా ఉన్న ఆయన 2007లో ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటి వరకు మూడుసార్లు ఎమ్మెల్సీగా గెలిచారు. 14 ఏళ్లుగా ఎమ్మెల్సీగా పనిచేస్తున్న లక్ష్మణరావుకు ఎటువంటి వ్యాపార సంస్థలూ లేవు. ఐదు ఎకరాల పొలం, 620 గజాల స్థలం, ఒక ఇల్లు ఉన్నాయి.
మొత్తం కోటీ 20 లక్షల ఆస్తి, మరో రూ.16 లక్షల బ్యాంకు బాలెన్సు, సొంత నగదు ఉన్నాయి. ఆయన భార్య పేరున మరో రూ.12 లక్షలు మాత్రమే ఉన్నాయి.
