- మేనిఫెస్టోలో టిడిపి కూటమి హామీ
- కూలీల్లో ఉత్కంఠ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : వ్యవసాయ కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ నెలకొల్పుతామంటూ టిడిపి-జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో సదరు హామీపై చర్చ మొదలైంది. ‘రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పర్చి రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తాం’ అని వాగ్దానం చేశారు. దాంతో ప్రభుత్వం నెలకొల్పే కార్పొరేషన్ ఏ విధంగా ఉండబోతోంది, లబ్ధిదారులను ఏ విధంగా గుర్తిస్తారు, ఏఏ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రవేశపెడతారు అనే విషయాలపై వ్యవసాయ కార్మికులు ఉత్కంఠగా ఉన్నారు. మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిలు, ప్రజాప్రతినిధులు, అధికారులను ఆసక్తితో ఆరా తీస్తున్నారు. కాగా ఇప్పటి వరకు ఆ అంశంపై ప్రభుత్వంలో చర్చ లేదని, ఈ కాలంలో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు నిర్వహిస్తున్న శాఖాపరమైన చర్చల్లో ప్రస్తావనకు రాలేదని, తొలి కేబినెట్ భేటీలో ఆ ఊసు లేదని సమాచారం. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనైనా ప్రకటన వెలువడుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
కోటి 40 లక్షల మంది
2010-11లో వెలువడిన గణాంకాల మేరకు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కోటి పది లక్షల వరకు వ్యవసాయ కార్మికులున్నారు. ఇప్పటికి వారి సంఖ్య కోటి 40 లక్షల వరకు చేరుకుందని అంచనా. అచ్చంగా వ్యవసాయ సంబంధ పనులు చేసే కూలీలు 32 శాతం ఉంటారు. ఆ లెక్కన 40 లక్షల వరకు కేవలం వ్యవసాయ పనులపైనే ఆధారపడ్డ వారున్నారు. మిగతా కార్మికులు వ్యవసాయ పనులతో పాటు ఇతర పనులు కూడా చేసుకొని పొట్ట పోసుకుంటున్నారు. వ్యవసాయ కూలీలలో 90 శాతానికిపైన ఎస్‌సి, ఎస్‌టి, బిసీలే. వీరిలోనూ గణనీయమైన సంఖ్యలో మహిళలున్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో వ్యవసాయ పనులు తగ్గుతున్నాయి. ఒకప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచే కూలీలు పనుల కోసం వేరే రాష్ట్రాలకు వలసలు వెళ్లేవారు. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచీ పనుల కోసం రాష్ట్రం దాటి పోతున్నారు. జాతీయ స్థాయిలో ఉపాధి హామీ చట్టం ప్రకారం గ్రామాల్లో పనుల్లేని సమయాల్లో ఏడాదికి కనీసం వంద రోజులు పని కల్పించాలి. కరువు, విపత్తులొచ్చినప్పుడు పని దినాలు, వేతనాలు పెంచాలి. అవేమీ అమలుకు నోచుకోవట్లేదు.
భవన నిర్మాణ కార్మికుల బోర్డు తరహాలోనా?
రైతు కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న టిడిపి కూటమి హామీతో వారిలో ఆసక్తి నెలకొంది. ఎప్పుడు కార్పొరేషన్ ఉనికిలోకొచ్చి తమకు ఆసరా అవుతుందా అని లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ఉన్న సంక్షేమ బోర్డు తరహాలోనే వ్యవసాయ కార్మికుల కార్పొరేషన్ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. కేరళలో వ్యవసాయ కార్మిక సంక్షేమ బోర్డు దేశానికి ఆదర్శంగా ఉందని గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాల నిర్ణయం, అమలు బాధ్యత ప్రభుత్వానిది, కార్మికశాఖది. చాలా ఏళ్ల నుంచి కనీస వేతనాల నిర్ణయం లేదు. దాంతో కార్మికులు తమ శ్రమకు న్యాయంగా దక్కాల్సిన దినసరి కూలి అందక ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ అంశం కూడా కార్పొరేషన్ పరిధిలోకి చేరుస్తారా అనే ప్రశ్నలు కార్మికుల నుంచి వినపడుతున్నాయి.