అప్పులభారంతో ఉరేసుకొని దంపతులు ఆత్మహత్య

ముదినేపల్లి (కృష్ణా) : ” అప్పు తీర్చాక చనిపోదాం అనుకున్నాం. మా మీద మాకు అసహ్యం పుట్టి చనిపోతున్నాం.” అని భార్యభర్తలు అప్పులభారంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం సాయంత్రం ముదినేపల్లి మండలంలో జరిగింది.

స్థానిక వివరాల మేరకు … ముదినేపల్లి మండలం పెదగొన్నూరు శివారు విశ్వనాద్రిపాలెం గ్రామానికి చెందిన పరసా మాతనాగబాబు (30)కు, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన అనూష (28)కు 2015లో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. నాగబాబు గ్రామంలోనే రొయ్యలు సాగు చేశారు. ఈ ఏడాది జూన్‌తో చెరువు లీజు పూర్తి కాగా, సుమారు రూ.10 లక్షల మేర అప్పులపాలయ్యారు. దీంతో భార్య నగలను తాకట్టు పెట్టారు. నాగబాబు తండ్రి కొంత అప్పు తీర్చినప్పటికి ఇంకా ఉంది. రొయ్యల సాగుతో నష్టపోయిన నాగబాబు, దానిని విరమించుకొని సింగరాయపాలెంలోని ప్రైవేటు పరిశ్రమలోని ఎలక్ట్రికల్‌ విభాగంలో పనిచేస్తున్నారు. మరోవైపు మూడు నెలల క్రితం భార్యతో ఇంటి వద్దే సోడా బండి పెట్టించారు. నిన్న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో పైకప్పునకు రెండు చీరలతో ఉరేసుకుని దంపతులు మృతి చెందారు. పక్క ఇంట్లో నివాసముంటున్న నాగబాబు తల్లి వెంకటరమణ కూలిపనికి వెళ్లి వచ్చి సాయంత్రం మినప్పప్పు కోసం వెళ్లి చూడగా, భార్యాభర్తలు ఇంటి దూలానికి ఉరేసుకొని వేలాడుతూ కనిపించారు. వెంటనే స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించడానికి యత్నించగా అప్పటికే వారిద్దరూ మృతి చెందారు. పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి విగతజీవులుగా పడి ఉన్న తల్లిదండ్రులను చూసిన ఆ చిన్నారులు కంటనీరు పెట్టడం చూపరులను కలచివేసింది. కైకలూరు రూరల్‌ సిఐ కృష్ణకుమార్‌, ఎస్‌ఐ వెంకటకుమార్‌ సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దంపతులు రాసిన ఉత్తరం…

” అమ్మా, నాన్నా క్షమించండి, మాకు బతకడం ఇష్టం లేదు. అప్పు తీర్చాక చనిపోదాం అనుకున్నాం. మా మీద మాకు అసహ్యం పుట్టి చనిపోతున్నాం. పిల్లలు జాగ్రత్త. మా ఇద్దరి కిడ్నీలు ఎవరికైనా పనికొస్తే ఇవ్వండి.హెల్ప్‌ అవుతుంది ” అంటూ వారు రాసిన ఉత్తరం గదిలో దొరికింది. ” మా వల్ల ఎవరూ గొడవ పడకండి, మా అంతట మేమే చనిపోతున్నాం. ఎవరి మీదా కోపంతో కాదు..” అని అందులో వివరించారు. బంధువులకు ఇవ్వాల్సిన రూ.5 వేల బాకీ, బీరువాలో ఉన్న రూ.50 వేల సొమ్ము, మూడు నెలల్లో పూర్తవుతున్న బండి ఈఎంఐ, బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము తదితరాల గురించి ఆ లేఖలో పేర్కొన్నారు.

➡️