ప్రజాశక్తి- గణపవరం (పశ్చిమగోదావరి జిల్లా): పశ్చిమగోదావరి జిల్లా గనఫవరం మండలం సరిపల్లిలో చేపలు, రొయ్యల మేత తయారీ (సిపిఎఫ్) ఫ్యాక్టరీని యాజమాన్యం గురువారం మూసివేసింది. దీంతో, ప్రస్తుతం ఫ్యాక్టరీలో పనిచేసే 71 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. 2013లో థాయిలాండ్‌కు చెందిన వ్యాపారులు సరిపల్లిలో సిపిఎఫ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. గణపవరం, సరిపల్లి, తణుకు, వైజాగ్, భీమవరం ప్రాంతాలకు చెందిన 195 మందిని ఫ్యాక్టరీలో ఇంజనీర్లుగా, ప్రొడక్షన్ మేనేజర్లుగా, క్వాలిటీ అధికారులుగా తీసుకున్నారు. 2023 వరకూ మూడు షిఫ్టులతో ఫ్యాక్టరీ నడిచింది. దేశవ్యాప్తంగా భారీ లాభాలతో కొనసాగింది. ప్రస్తుతం నష్టాల బాటలో నడుస్తోందని, యాజమాన్యం ఫ్యాక్టరీలో పనిచేసే కొద్ది మందిని రాజమండ్రి, వైజాగ్‌లో ఉన్న ఫ్యాక్టరీలకు బదిలీ చేసింది. కొంతమంది మానేసి వెళ్లిపోయారు. మిగిలిన 71 మంది ఉద్యోగులు మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు. ఫ్యాక్టరీ నష్టాల బాటలో నడుస్తోందని, నెల రోజులు పని చేసినా 20 రోజులకు జీతం ఇస్తామని చెబుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వద్ద మూడు నెలలుగా ఈ విషయంపై చర్చించినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. గురువారం ఫ్యాక్టరీని మూసివేసి తమను బయటకు పంపివేసి గేట్లకు తాళం వేసిందని తెలిపారు. చేసేదిలేక గేటు వద్ద ఆందోళన చేపట్టామన్నారు. ఫ్యాక్టరీలో చేరినప్పుడు ఉద్యోగ భద్రత కల్పిస్తామని థాయిలాండ్ యాజమాన్యం హామీ ఇచ్చిందని, ఆ హామీని నెరవేర్చకుండా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులను, ఉద్యోగులను బయటకు పంపడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం జిల్లా కలెక్టర్‌కు తెలియజేశామని, ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. సరిపల్లిలో సిపిఎఫ్ ఫ్యాక్టరీని కొనసాగించాలని, కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు ఎం.పెంటారావు, పి.గోవిందు డిమాండ్ చేశారు. నష్టాలు వస్తున్నాయనే వంకతో కార్మికులను రోడ్డున పడేయటం అన్యాయమన్నారు. జిల్లా లేబర్ అధికారులు కలుగజేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.
