ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేసే కుట్రలో భాగంగానే కార్మికులకు విఆర్‌ఎస్ ప్రతిపాదన, దరఖాస్తులకు తెరతీశారని, ఇది సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ ఇస్తున్న కానుకని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకూ ఉద్యోగులు, కార్మికులు విఆర్‌ఎస్‌కు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తామంటూ యాజమాన్యం ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. . గత నాలుగు నెలలుగా ప్లాంట్ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదని, దీంతో వారికి రూ.250 కోట్లు బకాయిలు పేరుకుపోయినట్లు ఆయన తెలిపారు. మరోవైపు ఫ్యాక్టరీలో ఉత్పత్తి తగ్గిస్తున్నారని, గనులు కేటాయించాలని కోరితే, దాన్ని పక్కనపెట్టి అనకాపల్లిలో నెలకొల్పే మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించారని వెల్లడించారు. సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు చాలా గట్టిగా మాట్లాడారని, అధికారంలోకి వచ్చిన అనంతరం ఒక్క మాట కూడా మాట్లడటం లేదన్నారు. ఇటీవల ప్రధాని విశాఖకు వస్తే ఆ సభలో కనీసం స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట మాట్లాడలేకపోయారని తెలిపారు.
