ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర బడ్జెట్.. కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణం, కేంద్రీయ విద్యా సంస్థలకు నిధులు వంటి వాటిపై కనీసం నోరు మెదపలేదని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్‌కు మాత్రం మకాన్ బోర్డు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్‌స్టిట్యూట్, ఐఐటి పాట్నా, గ్రీన్ ఎయిర్ పోర్టులు, నీటి సరఫరా కోసం మిథిలాంచెల్లో కాలువ నిర్మాణం వంటి వరాలు ప్రకటించారని తెలిపారు. రైతుల పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరపై ప్రస్తావన లేదన్నారు. వ్యవసాయంలో వెనుకబడిన జిల్లాలకు అమలు చేసే ధన, ధాన్య, కృషి యోజన పథకం కేవలం వంద జిల్లాలకే పరిమితం చేసినట్లు చెప్పారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించడం, ప్రభుత్వ రంగ సంస్థల్లోని పెట్టుబడులను రెండో విడతగా ఉపసంహరించాలనుకోవడం, ఆస్తుల విక్రయం, ప్రైవేటు భాగస్వామ్యంతో మారిటైమ్ మిషన్ వంటి నిర్ణయాలు కార్పొరేట్లకు అనుకూల అంశాలుగా ఉన్నాయని తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు తీసుకున్న చర్యలు శూన్యమన్నారు.
