దేశంలో అధికార మార్పిడి తప్పదు : సిపిఐ నారాయణ

May 16,2024 22:12 #cpi narayana

ప్రజాశక్తి – తిరుపతి సిటీ : ‘దేశంలోనూ, రాష్ట్రంలోనే అధికార మార్పిడి తప్పదు. పాలకుల విధానాలతో విసుగెత్తిన జనం… తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో చూపటానికి పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. కేంద్రంలో బిజెపికి పరాభవం తప్పదు. ఉత్తర భారతదేశంలో బిజెపికి ఎదురు దెబ్బ తగులుతోంది. అందుకే దక్షిణాదిపై వారు దృష్టి సారించారు. మోడీ చేతిలో కేంద్ర ఎన్నికల కమిషను కీలు బొమ్మగా మారింది’ అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. తిరుపతి నగరం బైరాగపట్టెడలో గల గంధమనేని శివయ్య భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మెడికి అనుకూలంగా ఎన్నికలు జరిగే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తోందన్నారు. అందుకే వారణాసి ప్రాంతంలో చివరి విడత ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఉత్తర భారతంలో ఎన్‌డిఎ కూటమి 40 నుంచి 45 శాతం సీట్లు కోల్పోతుందన్నారు. ఢిల్లీలో ఒక్క సీటు కూడా బిజెపికి రాదన్నారు. యుపి, గుజరాత్‌లో కూడా బిజెపికి సీట్లు తగ్గుతాయన్నారు. మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి అన్నారు. మోడి హయాంలోనే రూ.16 లక్షల కోట్లు అప్పు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయారని… ఇందులో విజరు మాల్యా తప్ప మిగతా వారందరూ గుజరాత్‌ వారేనని ఆయన చెప్పారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రామానాయుడు మాట్లాడుతూ… ఓటింగ్‌ శాతం పెరగడం వలన వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. ఓటింగ్‌ శాతం పెరగడమనేది మార్పుకు సంకేతమని అభిప్రాయపడ్డారు. ఇక తిరుపతిలో చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడిని… మీడియా వారిపై పోలీసులు లాఠీ ఛార్జి చేసిన ఘటనలను రామానాయుడు ఖండించారు.

➡️