ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిని ఎదుర్కొనేది కమ్యూనిస్టులే

  • సిపిఎం 27వ మహాసభ సౌహార్థ సందేశంలో కె.రామకృష్ణ

ప్రజాశక్తి- కామ్రేడ్‌ సీతారాం ఏచూరి నగర్‌ (నెల్లూరు) : దేశంలో విభజన రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపిని రాజకీయంగా, సైద్ధాంతికంగా ఎదుర్కొనే శక్తి కమ్యూనిస్టులకే ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. నెల్లూరులో సీతారాం ఏచూరినగర్‌(అనిల్‌గార్డెన్స్‌)లో శనివారం ప్రారంభమైన సిపిఎం 27వ మహాసభలో ఆయన సౌహార్థ సందేశం ఇచ్చారు. దేశంలో కమ్యూనిస్టుల మధ్య రాజకీయ అంశాల విషయంలో తేడాలు ఉన్నాయని, సిపిఐ, సిపిఎం రెండూ మార్క్సిజం, లెనినిజంపై ఆధారపడి పనిచేస్తున్నాయని తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలోనూ, రాష్ట్రంలోనూ రాజకీయ ఆందోళనల్లో కలిసికట్టుగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ప్రభుత్వం భవిష్యత్‌లో అధికారంలోకి రాకూడదని, దీనికోసం కమ్యూనిస్టులు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. 11 ఏళ్లలో దేశంలో అభివృద్ధి పనులేమీ చేయకపోయినా మత ప్రాతిపదికన సమాజాన్ని చీల్చారని అన్నారు. కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని విమర్శించారు. పదేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని, దానికి వంతపాడుతున్న పార్టీలు కూడా వాటి గురించి మాట్లాడటం లేదని తెలిపారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్‌ జనాన్ని కలవలేదని, ఆయన కార్యాలయానికి కూడా ఎవరినీ రానీయలేదని అన్నారు. దీంతో ప్రజలు ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్దిచెప్పారని తెలిపారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన మోడీ మూడు లక్షల కోట్లు ఇచ్చామని చెబుతున్నారని, ఎక్కడ ఇచ్చారో ఎవరికి ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. నిజంగా కేంద్రం నిధులు ఇచ్చి ఉంటే అప్పులు ఎందుకు చేశారో అదన్నా చెప్పాలని టిడిపిని ప్రశ్నించారు. స్టీలు ప్లాంటు విషయంలోనూ కేంద్రం స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు.

➡️