ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి పాలనలో జగన్‌కు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి, ఇప్పుడు ఆ కాలంలో మానవ విపత్తు జరిగిందని కేంద్ర హోంమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. ఆ నాటి విపత్తుకు మద్దుతుగా నిలిచి ఇప్పుడు ఏమీ తెలియనట్లు వ్యాఖ్యానించడం రాష్ట్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడమేనని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రానికి గత ఆరు నెలల్లో రూ.3 లక్షల కోట్లు ఇచ్చినట్లు చెప్పడాన్ని తప్పుబట్టారు. ఈ నిధులకు సంబంధించిన వివరాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేస్తామని చెబుతున్నారని, గత పదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్లు ఇవ్వడం శాశ్వత పరిష్కారం కాదని, తాత్కాలిక ఉపశమనమేనని చెప్పారు. అమరావతికి రూ.15 వేల కోట్లు రుణం ఇచ్చి, నిధులు ఇచ్చినట్లు చెప్పడం సరికాదన్నారు.
