సిపిఎం నేతలు ఉమామహేశ్వరరావు, రమాదేవి
ప్రజాశక్తి- కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ (నెల్లూరు) : హిందూత్వశక్తుల మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజాతంత్ర, లౌకిక శక్తులను కలుపుకొని పోరాటాలు చేయబోతున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, డి.రమాదేవి తెలిపారు. నెల్లూరు నగరంలో సిపిఎం రాష్ట్ర మహాసభ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిందని చెప్పారు. మన రాష్ట్రంలో మత సామరస్యం ఉందన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడం, ఈ కూటమిలో బిజెపి ఉండడంతో రాష్ట్రానికి మతోన్మాద ప్రమాదం పెరిగిందన్నారు. మత ఘర్షణలు రెచ్చగొట్టే యత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మతోన్మాదాన్ని అడ్డుకోవాలని సిపిఎం రాష్ట్ర మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు చెప్పారు. రాష్ట్రంలో శాంతిని, సామరస్యాన్ని కాపాడుకొనేందుకు వామపక్షాలు, ప్రజాతంత్ర, లౌకిక శక్తులను కలుపుకొని పోరాటానికి సిద్ధమవుతామని తెలిపారు. మంచి మద్యం పేరుతో టిడిపి కూటమి ప్రభుత్వం మద్యం వ్యాపారం చేస్తోందన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతోందని, బెల్ట్ షాపులు హల్‌చల్ చేస్తున్నాయని తెలిపారు. వీటివల్ల, సాంస్కృతిక కాలుష్యం పెరిగి మహిళలు, యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. వీటిని అరికట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విజన్ 2047 వల్ల కార్పొరేట్ శక్తులకు విజన్ తప్ప, సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని సిపిఎం కోరుకుంటోందని, అందుకోసం పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తేనే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని వివరించారు. రాష్ట్ర ఆదాయం పెరగాలంటే కార్పొరేట్ శక్తులకు ఐదు లక్షల ఎకరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, అదే ఐదు లక్షల ఎకరాలను భూమిలేని నిరుపేదలకు ఇస్తే ఆదాయం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని తెలిపారు. ఎన్‌డిఎ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్ర విభజన హామీలపై ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 1.50 కోట్ల మందికిపైగా ఉన్న కార్మికుల సంక్షేమాన్ని కోరే వారైతే కార్మిక చట్టాల స్థానే తీసుకొచ్చిన లేబర్ కోడ్స్‌ను రాష్ట్రంలో అమలు చేయబోమని కేంద్రానికి చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించాలని, ప్రత్యేక గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు సంస్థ ఆర్సెల్ మిట్టల్‌కు గనులు ఇవ్వడానికి తపనపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు… విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించేందుకు ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రజా అజెండాయే ధ్యేయంగా కలిసి వచ్చే శక్తులు, వ్యక్తులను కలుపుకొని సిపిఎం ప్రజాపోరాటాలు నిర్వహిస్తుందని చెప్పారు.
CPI(M) AP 27th State conference : మతోన్మాదంపై ఐక్య పోరాటం
