- సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇసుకను ఉచితంగా ఇస్తామంటూ ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలని కోరుతూ అక్టోబర్ 4వ తేది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు నిచ్చింది. సెప్టెంబర్ 23, 24 తేదీలలో విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం ప్రజా సమస్యలపై పలు తీర్మానాలు ఆమోదించింది. దీనిలో భాగంగా ఇసుకపై చేసిన తీర్మానానికి సంబంధించిన అంశాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంగళవారం మీడియాకు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా ఇసుక లభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, అందరికీ ఇసుక అందుబాటులోకి తేవాలని, అవినీతిని అరికట్టి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి చూపాలని నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. వీటి సాధన కోసం అక్టోబర్ 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు దీక్షలు ప్రదర్శనల రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలకు సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. భవన నిర్మాణాలు చేసుకునే వారిపై అధిక భారం లేకుండా చూడాలనీ తీర్మానంలో కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక లభించకపోవడం, రేట్లు పెరిగిపోవడం, విచ్చలవిడి అవినీతి వల్ల ప్రజల్లో తీవ్ర అసంతప్తి ఏర్పడిందని పేర్కొన్నారు. అనేక కారణాలతో పాటు ఇసుక సమస్యపై అగ్రహంతో వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించారని, ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. వందరోజుల పాలనలో ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని పేర్కొన్నారు. అనేకచోట్ల ఇసుక లభించడం లేదని, రవాణా ఛార్జీలు, ఇతర పేర్లు చెప్పి ఇసుక రేట్లు తగ్గించలేదని తెలిపారు. కొన్నిచోట్ల మరింత పెరిగాయని, ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నదని, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు పలుచోట్ల ఇసుకపై పెత్తనం చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదేపదే బహిరంగంగా హెచ్చరిస్తున్నా పరిస్థితిలో మార్పు రాలేదని తెలిపారు. ఇసుక కొరత, అధిక రేట్ల వల్ల భవన నిర్మాణరంగం ఇబ్బందులు ఎదుర్కొంటోందని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కొరవడుతోందని, ఇళ్ల నిర్మాణాలు చేసుకునే చిన్న, మధ్యతరగతి వర్గాలపై భారం పడుతుందని వివరించారు. ఇసుక ఆన్లైన్ విధానం ప్రవేశపెడుతున్నామని ప్రకటించించినా ప్రభుత్వ ప్రకటనలకు, హామీలకు, ఆచరణకు పొంతనలేదని, ధరల్లో తీవ్ర వ్యత్యాసం కనబడుతోందని తెలిపారు.