ప్రజాశక్తి-విజయవాడ : తిరుమల ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) డిమాండ్ చేసింది. బాధితులు, కుటుంబాలను ఆదుకోవాలని సిపిఐ(ఎం) విజ్ఞప్తి చేసింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు భక్తులు చనిపోవడం పట్ల సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ ఘాతుకానికి టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగమే బాధ్యత వహించాలని తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు పోటీపడి వస్తారని అంచనా వున్నా, దానికి తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఈ విషాదకర ఘటన జరిగిందన్నారు. దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలు కోటి రూపాయలు చొప్పున ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స, ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు. మొత్తం ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.