విద్వేష వ్యాఖ్యలతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేయొద్దు : సిపిఐ(యం)

ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ గురువారం తిరుపతిలో వారాహి డిక్లరేషన్‌ పేరిట జరిగిన సభలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తాను ఒక రాజ్యాంగబద్ద బాధ్యతలో ఉంటూ ఒక మతతత్వ ప్రతినిధిలా ఇతర మతాలను తూలనాడే విధంగా వ్యాఖ్యానించడం రాజ్యాంగ విరుద్దమని పేర్కొన్నారు. రాజ్యాంగ విహితమైన లౌకికతత్వాన్ని గౌరవించవలసింది పోయి ‘‘సూడో సెక్యులరిజం’’ అంటూ చులకనగా మాట్లాడడం, మంత్రిగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమేనని తెలిపారు. న్యాయ స్థానాలకు ఉద్దేశాలు ఆపాదించి, వ్యాఖ్యలు చేయడం న్యాయ వ్యవస్థను అగౌరవపర్చడమేనని పేర్కొన్నారు.
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన రాజ్యాంగ పీఠికలో ప్రముఖమైన సెక్యులరిజాన్ని విమర్శించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు. మత సామరస్యాన్ని కోరుకునే వారిని, మతోన్మాదాన్ని వ్యతిరేకించే వారిని సూడో సెక్యులరిస్టులు అంటూ లౌకికవాదాన్ని హేళన చేయడం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘపరివార్‌ ఉచ్చులో పడి రాష్ట్రానికి హాని చేయడమేనని తెలిపారు.
సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం దేశవ్యాపితంగా చట్టాన్ని తేవాలని పవన్‌కళ్యాణ్‌ డిమాండ్‌ చేయడం ఈ దేశ సెక్యులర్‌ రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేయడమేనని పేర్కొన్నారు. సనాతన ధర్మమంటే నిర్వచనం ఏమిటో అది ఏ పురాణాల్లో వుందో వారు చెప్పాలని కోరారు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, అంటరానితనం, లింగ వివక్ష వంటి జాడ్యాలతో కూడి ఉన్న వ్యవస్థనా సనాతన ధర్మమంటే? ఇదే అయితే ఈ దేశ రాజ్యాంగం, అత్యధిక మంది ప్రజలు సమానత్వ ధర్మాన్ని కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్  గుర్తించాలని తెలిపారు. న్యాయ వ్యవస్థను సైతం తూలనాడుతూ, దానికి ఉద్దేశాలు ఆపాదించడం పవన్‌కళ్యాణ్‌ గౌరవాన్నే తగ్గిస్తుందన్నారు.
దేశంలో మత విద్వేష ధోరణులు పెరిగి సమైక్యత, సమగ్రతలకు ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి విద్వేష వ్యాఖ్యలు రాష్ట్రానికి చేటు చేస్తాయని హెచ్చరించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండవలసింది పోయి రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ప్రమాదకరమన్నారు. ఈ ధోరణులను నిరసించవలసిందిగా, మత సామరస్యాన్ని, లౌకికతత్వాన్ని కాపాడేందుకు రాష్ట్రంలోని వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులు, మేధావులు, యువత, మహిళలు, వివిధ సామాజిక శక్తులు ముందుకు రావాలని వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

➡️