- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రొయ్య కిలో 100 కౌంట్‌ను రూ.270కు కొనాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రొయ్యల ధరను నిర్ణయించేందుకు విజయవాడలో ట్రేడర్స్, రైతు ప్రతినిధులతో చర్చలు జరిపి నిర్ణయించిన రేట్లు రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా, ఏ మాత్రమూ న్యాయంగా లేవని తెలిపారు. 100 కౌంటు ఉత్పత్తికి రూ.250 ఖర్చు అవుతున్నట్లు రైతులు తెలిపారని, కానీ ధర రూ.230గా నిర్ణయించడం రైతులను నష్టపెట్టడం తప్ప ఆదుకోవడం కాదని పేర్కొన్నారు. ప్రతి కౌంటుకు ప్రస్తుతం నిర్ణయించిన ధరలకు ప్రభుత్వం కూడా కొంత మొత్తం అదనంగా కలిపి సబ్సిడీ ఇవ్వాలని కోరారు. ట్రప్ ఆంక్షలకు ముందు కిలో రూ.260 ఉందని, ఆంక్షల తరువాత రూ.200లోపు పడిపోయిందని, ప్రస్తుతం రూ.225కు చేరిందని అన్నారు. అంటే ట్రేడర్లు రూ.5 పెంపుదలను మాత్రమే అంగీకరించారని పేర్కొన్నారు. ఇది ఏ మాత్రమూ గిట్టుబాటు కాదని, సమావేశంలో రైతుల కష్టాలు, నష్టాల కంటే ట్రేడర్లకు ఇబ్బందులు ఉన్నాయని ఎక్కువగా చర్చలు జరిగినట్లు ఉందని తెలిపారు. ట్రేడర్లకు ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం పరిష్కరించాలని, రైతుల కష్టాన్ని పంటకు ధర కల్పించడమనే అంశాన్ని తక్కువ చేసి చూడటం, రైతులను సర్దుకోవాలనడం సరికాదని పేర్కొన్నారు. . చంద్రబాబు చెబుతున్న పి4 ప్రకరాం పైనున్న ఎగుమతిదారులు, బ్రోకర్లు కిందనున్న ఆక్వా రైతులకు న్యాయమైన ధర ఇచ్చి ఆదుకోవాలని, అందుకు ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫీడ్ ధరల నియంత్రణ, న్యాయమైన సీడ్, ఫీడ్, శీతల గిడ్డంగుల వసతి, కరెంటు రాయితీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనివని పేర్కొన్నారు. వాటిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని, రైతులను ఆదుకోవాలని కోరారు. ధరల స్థిరీకరణ నిధి, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం ద్వారా రొయ్యల రైతులను తక్షణం ఆదుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కష్టంతో వేలకోట్లు ఆదాయాన్ని పొందడమే కాకుండా రైతులను పట్టించుకోవాలని సూచించారు. తగు న్యాయం జరగకపోతే కార్యాచరణ రూపొందించుకోవాలని రైతులను కోరారు. ప్రభుత్వం అన్ని రైతు సంఘాలతోనూ చర్చలు జరపాలని సూచించారు.