- ముఖ్యమంత్రికి సిపిఎం లేఖ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అరకొర పెన్షన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్‌టిసి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో ఆర్‌టిసిలో పనిచేసి రిటైర్డ్ అయిన వారు 40 వేల మంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వీరిలో నూటికి 60 మందికి ఇపిఎస్-95 కేంద్ర పెన్షన్ స్కీమ్ ద్వారా నెలకు రూ.1,000, మరికొందరికి రూ.2,500 వరకు చేతికి అందుతున్నాయని తెలిపారు. ఇవి కూడా వారు సర్వీసులో ఉండగా వేతనంలో మినహాయించిన పైకం నుండి ఇపిఎస్-95 పెన్షన్‌కు జమ చేసి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అరకొర పెన్షన్‌తో రిట్టెర్డ్ ఉద్యోగుల కుటంబాన్ని సాగించడం కష్టమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల ద్వారా వారికి ఎలాంటి సహాయం అందడంలేదని పేర్కొన్నారు. పేదలకు ఇచ్చే తెల్లరేషన్ కార్డు, వద్ధాప్య పెన్షన్ పథకం, ఆరోగ్యశ్రీ మొదలగునవి ఏవీ ఆర్టీసి రిట్టెర్డ్ ఉద్యోగులకు వర్తించడం లేదని తెలిపారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని రిట్టెర్డ్ ఆర్‌టిసి ఉద్యోగులకు తెల్లరేషన్ కార్డు, వద్ధాప్య పెన్షన్, ఆరోగ్యశ్రీ మొదలగు ప్రభుత్వ పథకాలు వర్తించేట్లుగా అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.