బిగింపును అడ్డుకున్న వినియోగదారులు
సిపిఎంతో కలిసి ఆందోళన
తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు
ప్రజాశక్తి-విజయవాడ : స్మార్ట్ మీటర్ల బిగింపును వినియోగదారులు మంగళవారం అడ్డుకున్నారు. విజయవాడ గాంధీనగర్ రాజ్ యువరాజ్ థియేటర్ సమీపంలోని దత్త కాంప్లెక్స్‌లో వినియోగదారులకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా అధికారులతో కలిసి అదానీ కంపెనీ సిబ్బంది విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను ప్రారంభించారు. దీనిని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ తదితరులు అక్కడికి చేరుకొని స్థానికులతో కలిసి మీటర్ల బిగింపును అడ్డుకున్నారు. కాంప్లెక్స్‌లో బిగిస్తున్న స్మార్ట్ మీటర్లను బయటకు తీసుకొచ్చి వాటిని ప్రదర్శిస్తూ వినూత్న రీతిలో ఆందోళనకు దిగారు. వినియోగదారులకు భారంగా తయారైన స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని, అదానీ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసుకోవాలని, ప్రభుత్వం మాట తప్పడం సరికాదని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చుట్టుపక్కల షాపింగ్ కాంప్లెక్స్‌లోని వారు ఈ ఆందోళనకు మద్దతు పలికారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు ఆందోళన కొనసాగింది. దీంతో, విద్యుత్ శాఖాధికారులు అక్కడికి చేరుకుని సిపిఎం నాయకులతో చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటిని బిగిస్తున్నామని సమాధానమిచ్చారు. స్మార్ట్ మీటర్ల బిగింపుపై ప్రజల నిరసనను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని వివరించారు. మీటర్ల బిగింపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేశారు. అధికారుల హామీతో స్థానికులు, సిపిఎం నాయకులు ఆందోళన విరమించారు. మీటర్ల బిగింపును ఆపకపోతే ప్రతిఘటిస్తామని, స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఆందోళన సాగిస్తామని హెచ్చరించారు. సిహెచ్.బాబూరావు, డి.కాశీనాథ్ మాట్లాడుతూ టిడిపి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి విద్యుత్ వినియోగదారులకు దొంగచాటుగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించడం శోచనీయమన్నారు. దశలవారీగా రాష్ట్రంలోని రెండు కోట్ల మంది వినియోగదారులకు, వ్యవసాయ పంపు సెట్లకు, నివాస గృహాలకు, వ్యాపార సంస్థలకు మీటర్లు బిగించడానికి రంగం సిద్ధం చేసిందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉండగా టిడిపి, జనసేన నేతలు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారని, హైకోర్టులో కేసులు వేశారని, స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టాలని చంద్రబాబు, లోకేష్ నాడు పిలుపు ఇచ్చారని గుర్తు చేశారు. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మీటర్లు బిగించడం సరికాదన్నారు. గత వైసిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లంగి విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని చేపట్టిందంటూ, అదానీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ తదితర సంస్థలతో కుమ్మక్కయి అవినీతికి పాల్పడిందంటూ ఈ ఒప్పందాలను టిడిపి వ్యతిరేకించిందని గుర్తు చేశారు. అధికారంలోకొచ్చాక వీటిని రద్దు చేయాల్సిందిపోయి ప్రజావ్యతిరేక, అవినీతికర ఒప్పందాన్ని చట్టబద్ధం చేసి అమలు చేయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం విజయవాడ పశ్చిమ, సెంట్రల్ సిటీ కార్యదర్శులు బోయి సత్యబాబు, బి.రమణరావు తదితరులు పాల్గన్నారు.
