ఆ ముగ్గురూ మాయల మరాఠీలు

  • ఎవరు గెలిచినా స్టీల్‌ప్లాంట్‌ నాశనం
  • మోడీ, జగన్‌, చంద్రబాబులపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శ
  • ఉత్సాహంగా సిపిఎం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు నామినేషన్‌

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ‘ప్రభుత్వ రంగంలోని విశాఖ ఉక్కు కర్మాగారం లేకుంటే గాజువాక అభివృద్ధే లేదు. అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటీకరణతో నాశనం చేసేందుకు కేంద్రంలోని మోడీ పూనుకున్నారు. ఆయనకు చంద్రబాబు, జగన్‌ మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ముగ్గురు మాయల మరాఠీలూ ఉక్కు ఉసురు తీసేందుకు కంకణం కట్టుకున్నారు’ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి మరడాన జగ్గునాయుడు గాజువాక తహశీల్దార్‌ కార్యాలయంలో శనివారం నామినేషన్‌ వేశారు. తొలుత కొత్త గాజువాక నుంచి పాత గాజువాక వరకూ ర్యాలీ నిర్వహించారు. సిపిఎం, ఇండియా వేదిక శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లేసి జగ్గునాయుడును గెలిపించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆద్యంతం ఈ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అనంతరం పాత గాజువాక జంక్షన్‌లో జరిగిన సభలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాకలో టిడిపి, వైసిపిల్లో ఎవరికి ప్రజలు ఓటేసినా బిజెపికి వేసినట్టేనన్నారు. ఇటీవల గాజువాక వచ్చిన చంద్రబాబు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ జరగకుండా మోడీకి నచ్చచెబుతాననడం హాస్యాస్పదమన్నారు. ఇన్నాళ్లూ ఎందుకు నచ్చజెప్పలేదని ప్రశ్నించారు. నారా లోకేష్‌ విశాఖ వచ్చినప్పుడు స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు మద్దతు ఇవ్వాలని కార్మికులు కోరితే… వాహనంతో రూట్‌ మార్చుకుని ఆయన అమరావతి వెళ్లిపోయారని గుర్తు చేశారు. మాట తప్పి, రూటు మార్చే టిడిపికి ఓటేస్తే అధికారంలోకి వచ్చాక ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తారన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపితో కలిసి మంచి చేస్తానని చంద్రబాబు చెప్పడం పెద్ద మోసమన్నారు. రాష్ట్రంలో 0.8 శాతం మాత్రమే ఓట్లున్న బిజెపికి ఆరు ఎంపీ సీట్లు ఎలా ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకొస్తే పాలన అమరావతి నుంచి సాగదని, ఢిల్లీ నుంచే జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వారానికోసారి ఢిల్లీకెళ్లి మోడీని కలసి ఒక్కసారైనా ఉక్కు ఫ్యాక్టరీపై మాట్లాడారా? లేదా ఆయన కేసుల గురించే మాట్లాడారా? అనేది చెప్పాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి మాట్లాడుతూ బిజెపి పీడ విరగడైతేనే ప్రజలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు రక్షణ ఉంటుందన్నారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు రావడానికి 1980వ దశకంలో సిపిఎం చేసిన పోరాటాలే కారణమన్నారు. కాంగ్రెస్‌ విశాఖ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి మాట్లాడుతూ బిజెపిని, దానికి మద్దతు తెలుపుతున్న పార్టీలను ఓడించాలని కోరారు. ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపిస్తే మేలు జరుగుతుందన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్‌ శీర రమేష్‌ మాట్లాడుతూ ఢిల్లీలోని తమ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను మోడీ సర్కారు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రతిపక్షాలను లేకుండా చేసే కుట్ర దేశంలో సాగుతోందని విమర్శించారు. సిపిఐ జివిఎంసి ఫ్లోర్‌ లీడర్‌ ఎజె.స్టాలిన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి ప్రభుత్వం కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతోందన్నారు. వేదికపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ, గాజువాక సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మరడాన జగ్గునాయుడు ఉన్నారు. సభకు సిపిఎం గాజువాక జోన్‌ కార్యదర్శి ఎం.రాంబాబు అధ్యక్షత వహించారు.

➡️