కబేళా వద్దు.. పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలి

Mar 1,2024 11:03 #cpm, #Disneyland

డిస్నీల్యాండ్‌ వద్ద సిపిఎం, సిపిఐ ఆందోళన

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ (విజయవాడ) :  పేదల నివాసాల మధ్య కబేళా ఏర్పాటును నిలుపుదల చేయలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడలోని డిస్నీల్యాండ్‌ వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో గురువారం స్థానికులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ డిస్నీల్యాండ్‌ స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించి వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. డిస్నీల్యాండ్‌ లీజు పరిమితి పూర్తయ్యిందని, 57 ఎకరాల స్థలాన్ని నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఈ స్థలంలో మాంసం ఎగుమతి కోసం పశువులను వధించడానికి కబేళాను ఏర్పాటు చేస్తున్నారని, అందుకు బడా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో విజయవాడ నగరపాలక సంస్థ తీర్మానం చేసిందని చెప్పారు. కౌన్సిల్లో సిపిఎం నిరసన వ్యక్తం చేసినా లెక్కచేయకుండా కబేళా ఏర్పాటు తీర్మానాన్ని ఆమోదించారని తెలిపారు. కబేళా ఏర్పాటు వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీర్మానాన్ని రద్దు చేయాలని, కబేళా ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డి కాశీనాథ్‌, సిపిఐ నగర నాయకులు భాస్కరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి బి రమణరావు తదితరులు పాల్గన్నారు.

➡️