నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : సిపిఎం నేత మంతెన సీతారాం

Dec 13,2023 17:51 #cpm, #demands, #Drought, #Michaung Cyclone
cpm demand on cylcone effected

ప్రజాశక్తి-ప్రకాశం : తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం డిమాండ్ చేశారు. సిపిఎం ప్రకాశం జిల్లా ప్లీనం సమావేశం బుధవారం సుందరయ్య భవనంలో జరిగింది సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పూనాటి ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంతెన సీతారాం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మిచాన్ తుఫాను రాష్ట్రంలో రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది అన్నారు పంట చేతికి వచ్చే సమయంలో విచాంగ్ తుఫాను రావడం వల్ల పంట తీవ్రంగా దెబ్బతిన్నదన్నారు దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం మీన వేషాలు లెక్కిస్తుందని విమర్శించారు సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసు నుంచి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం తప్ప పని జరగటం లేదని విమర్శించారు. తుఫాను వెళ్లి వారం రోజులు పూర్తయినా ఇంతవరకు ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు దెబ్బతిన్న పంటకు ఎన్యుమురేషన్ ఇంత వరకు చేయలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతిన్న పంటకు ఎన్యుమరేషన్ చేసి నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉందన్నారు. గతంలో 400 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తే ప్రస్తుతం 103 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా కరువు మండలాలను గుర్తించి వెంటనే కరువు నివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ నేటికీ పారిశ్రామికంగా గాని వ్యవసాయ రంగం గానీ అభివృద్ధి చెందలేదన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని విమర్శించారు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న ప్రజా ఉద్యమకారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరి సరైంది కాదన్నారు ప్రజా ఉద్యమాలపై నిర్బంధం పెట్టి నిరంకుశంగా అణిచివేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరంకుశ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని ప్రజా ఉద్యమాలపై నిర్బంధాలను ఆపి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే జగన్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని ప్రజా అనుకూల విధానాలను అవలంబించాలని కోరారు.
గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు వెంటనే రిపేరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీప్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండవ గేటు విరిగిపోయిందన్నారు గేటును రిపేర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 16 నెలల క్రిందట ప్రాజెక్ట్ 3వ గేటు విరిగిపోయిన దానిని రిపేర్ చేసేందుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు ప్రాజెక్టు గేట్లు సరిగా లేకపోవడంతో నీరంతా వృధాగా పోతుందని, ఇలానే ఉంటే మిగతా గేట్లు కూడా విరిగిపోయి ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడే విధంగా కాకుండా పోతుంది అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రాజెక్టు గేట్లు రిపేరు చేసేందుకు నిధులు కేటాయించాలను డిమాండ్ చేశారు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి కరువు నివారణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో ఒక మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు జిల్లా మొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించి నివారణకు అవసరమైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి కొండారెడ్డి, ఎస్ కే మాబు, చీకటి శ్రీనివాసరావు, కంకణాల ఆంజనేయులు, ఎం రమేష్ ,ఊసా వెంకటేశ్వర్లు ,వెల్లంపల్లి ఆంజనేయులు , డిసోమయ్య, మరియు జిల్లా కమిటీ సభ్యులు పట్టణ మండల కమిటీ సభ్యులు శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️