ప్రజాశక్తి -వెల్దుర్తి (కర్నూలు) :హంద్రీనీవా కాల్వకు ఆదివారం రాత్రి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లెపల్లి దగ్గర గండిపడడంతో వెల్దుర్తి, కల్లూరు, కోడుమూరు మండలాల్లోని దాదాపు 250 ఎకరాల భూమి కోతకు గురైందని, పలు పంటలు నాశనం అయ్యాయని, నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం కర్నూలు జిల్లా కార్యదర్శి గౌస్ దేశారు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పిఎస్.రాధాకృష్ణ, జి.రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు గురుశేఖర్, నగేష్ డిమాండ్ చేశారు. గండి పడిన హంద్రీనీవా కాల్వను, కోతకు గురైన పంట పొలాలను మంగళవారం సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి గండి పడితే మంగళవారం వరకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం బాధ్యతారహితమని విమర్శించారు. గతంలో రెండుసార్లు గండి పడినప్పటికీ శాశ్వతమైన సిమెంట్ బండ్ వేయకుండా పైపైన మట్టికట్ట వేయడంతో రైతులకు భారీ నష్టం జరిగిందన్నారు. దాదాపు మూడు నుంచి నాలుగు అడుగుల లోతు వరకు భూమి కోతకు గురైందని, మొక్కజన్న, పొద్దు తిరుగుడు, కంది, మినుము, పత్తి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. అగ్రికల్చర్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకొని నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇచ్చేలా నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. పంట పొలాలను జిల్లా కలెక్టర్ పరిశీలించాలని కోరారు.
