ప్రజాశక్తి- నెల్లూరు : వాట్సాప్‌లో డేటా భద్రతకు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టిందని, ఇది కార్పొరేట్ శక్తులకు అనుకూలమైందని అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 160 సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తామని ప్రకటించిందన్నారు. దీనిద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారం బయట వ్యక్తులకు చేరే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ సేవలు ప్రస్తుతం గ్రామ/వార్డు సచివాలయాల్లో అమలు చేస్తున్నారని, దాన్ని కొనసాగిస్తే సరిపోతుందన్నారు. పౌరసేవల వినియోగానికి వాట్సాప్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం (డీల్) వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. పౌరుల వ్యక్తిగత డేటా అత్యంత విలువైన సంపదని, దాన్ని కార్పొరేట్ కంపెనీ ‘మెటా’ పరం చేయడం సరైంది కాదని అన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా డేటా భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారని తెలిపారు. దీన్నిబట్టి ఇప్పటివరకు అలాంటి ఏర్పాటు లేదని స్పష్టమవుతోందన్నారు. డీల్ వివరాలు, డేటా భద్రతకు సంబంధించిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
