– వాటి పరిష్కారానికి పోరాడతాం : సిపిఎం
– కొనసాగిన ప్రజా చైతన్య యాత్రలు
ప్రజాశక్తి-యంత్రాంగం : ‘ఎక్కడ చూసినా సమస్యలే. డ్రెయినేజీలు లేక రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తోంది. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. దోమల వల్ల రోగాల బారిన పడుతున్నాం. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. శ్మశాన వాటికలో ముళ్ల చెట్లను తొలగించడంలేదు. టిడ్కో ఇళ్లు మంజూరు చేసి ఏనిమిదేళ్లు కావస్తున్నా ఇప్పటికీ కేటాయించలేదు. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో కరెంటు బిల్లులు చెల్లించలేకపోతున్నాం.’ అంటూ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను నేతల దృష్టికి తీసుకొచ్చారు. నేతలు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి పోరాడతామని తెలిపారు.
నంద్యాల జిల్లా కేంద్రంతోపాటు నంద్యాల మండలంలోని బిళ్లాలపురంలో ‘డ్రెయినేజీ లేకపోవడంతో రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తోంది. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. రోగాల బారిన పడుతున్నాం. శ్మశాన వాటికలో ముళ్ల పొదలు పెరిగిపోయి అంత్యక్రియలకు ఇబ్బంది పడుతున్నాం’ అని గ్రామస్తులు, దళితులు సిపిఎం నాయకులకు తెలిపారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ మాట్లాడుతూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి పోరాడుతామని తెలిపారు. విశాఖ నగరంలోని అరుణోదయ కాలనీ, సుందరయ్యకాలనీల్లో జిఒ 296 పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యలపై స్థానికులు నాయకులకు విన్నవించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని చిన్న కలవలపల్లి, కొత్తపేట గ్రామాల్లో ఉపాధి హామీ కార్మికుల సమస్యలను నాయకులు తెలుసుకున్నారు. కె.కోటపాడు మండలంలోని రొంగలినాయుడుపాలెం గ్రామంలో చెరుకు రైతులతో సిపిఎం నేతలు మాట్లాడారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అల్లూరి జిల్లా కొయ్యూరు, పెదబయలు, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లో ప్రజా చైతన్య యాత్రలు సాగాయి. వంతెనలు సహా పలు దీర్ఘకాలిక సమస్యలను ఆదివాసీలు నాయకుల దృష్టికి తెచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం, పాలకోడేరు మండలాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్ మాట్లాడుతూ.. ఉండి ఎంఎల్‌ఎ రఘురామకృష్ణంరాజు అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను తొలగిస్తున్నారని తెలిపారు. పేదల ఇళ్లను అక్రమంగా తొలగించాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. విజయనగరంలోని పూల్‌బాగ్‌లో సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు ఆధ్వర్యంలో సిపిఎం నేతలు పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జిఒ 30 ప్రకారం పూల్‌బాగ్ పిజి కాలేజీ ఎదురుగా 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లకు రెండు సెంట్లు ఉచితంగా రెగ్యులర్ చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేపాడ మండలంలో ప్రజా చైతన్య యాత్ర సాగింది. జిడికి మద్దతు ధర ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలం పాచిపెంటలో సిపిఎం నేతలు పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. నెల్లూరు నగరం, రూరల్ డివిజన్లలో ప్రజా చైతన్య యాత్రలు జరిగాయి. ఇందుకూరుపేటలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రజలు పలు సమస్యలను నేతల దృష్టికి తీసుకొచ్చారు. టిడ్కో ఇళ్లు మంజూరు చేసి ఏనిమిదేళ్లు కావస్తున్నప్పటకీ ఇప్పటికీ తమకు కేటాయించలేదని, పెరిగిన విద్యుత్ ఛార్జీలు భారంగా మారాయని, డ్రెయినేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ బృందానికి స్థానికులు పలు సమస్యలు వెల్లడించారు. ఇరిగేషన్, ప్రభుత్వ పోరంబోకు స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు పట్టాలి ఇప్పించాలని కోరారు. పెదనందిపాడులో మురుగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థతో రోగాలపాలవుతున్నారని తెలిపారు. అర్హులకు రేషన్ కార్డులు, వృద్ధాప్య, వితంతు పెన్షన్లు ఇవ్వడం తెలిపారు. మంచినీటి సమస్యను తొలగించాలని కోరారు.
