సిపిఎం నేత వి.జి.కె మూర్తి కన్నుమూత

  • నేడు శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి భౌతికకాయం అప్పగింత

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి : సిపిఎం శ్రీకాకుళం జిల్లా సీనియర్‌ నేత వి.జి.కె మూర్తి (74) గురువారం ఉదయం కన్నుమూశారు. ఈనెల 15వ తేదీన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను శ్రీకాకుళం నగరంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రిమ్స్‌ వైద్య కళాశాలకు భౌతికకాయాన్ని అప్పగించనున్నారు. పార్టీ, ప్రజాసంఘాల నాయకులు సంతాపం తెలిపారు.

విజికె మృతి కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటు

 సిపిఎం సీనియర్‌ నేత విజికె మూర్తి మృతి కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మూర్తి మరణం అభ్యదయ ఉద్యమాలకు తీరని లోటు అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి. రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు, బి.తులసీదాస్‌, పూర్వ రాష్ట్ర కార్యదర్శి పి మధు, అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌, ఎంబివికె బాధ్యులు పి మురళీకృష్ణ పేర్కొన్నారు.

విజికె మూర్తి 1972లో ఎల్‌ఐసిలో ఉద్యోగిగా చేరారు. 1985లో సిపిఎం సభ్యుడిగా చేరారు. 1992లో సిఐటియు జిల్లా వ్యవస్థాపక అధ్యక్షునిగా పనిచేశారు. 1991లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. జ్యూట్‌, శ్యామ్‌పిస్టన్స్‌ కార్మికుల సుదీర్ఘ పోరాటాల్లో కీలకపాత్ర పోషించారు. ఆయన మరణించే నాటికి గరిమెళ్ళ విజ్ఞాన కేంద్రం అధ్యక్షునిగా, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విజికె మొదటి భార్య లక్ష్మి 1991లో మరణించారు. తర్వాత ప్రసూనాంబను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మూర్తి రెండు కళ్లను రెడ్‌క్రాస్‌కు దానం చేశారు. మరణాంతరం తన భౌతికకాయాన్ని బోధన, పరిశోధన నిమిత్తం రిమ్స్‌కు ఇవ్వాలన్న ఆయన కోరిక మేరకు కుటుంబసభ్యులు శుక్రవారం అప్పగించనున్నారు. కత్తెరవీధిలోని ఆయన నివాసం వద్ద శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు సంతాప సభ, అనంతరం రిమ్స్‌ కళాశాల వరకు ప్రదర్శనగా వెళ్లి భౌతికకాయాన్ని అప్పగించనున్నారు.

పార్టీ, కార్మిక, ఉద్యోగ, ప్రజాసంఘాల నాయకులు, కవులు, రచయితలు తదితరులు వి.జి.కె మూర్తి భౌతికకాయానికి నివాళులర్పించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.కె.ఎస్‌ కుమార్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి, కె.మోహనరావు, జి సింహాచలం, పి. తేజేశ్వరరావు, నాయకులు కె.శ్రీనివాసు, ఎం.ప్రభాకరరావు, కె.నాగమణి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజ శర్మ, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి జి.గిరిధర్‌, జామియా మసీదు చైర్మన్‌ ఖాన్‌, కథానిలయం కార్యదర్శి దాసరి రామచంద్రరావు, రచయితలు అట్టాడ అప్పలనాయుడు, చింతాడ తిరుమలరావు, కంచరాన భుజంగరావు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

➡️