బాపట్ల : తుఫాను ముంపు ప్రాంతాల్లో సిపిఎం నేతలు పర్యటించారు. మిచౌంగ్ తుఫాన్ కారణంగా … నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం బృందం డిమాండ్ చేసింది.
బుధవారం బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు రమాదేవి, జిల్లా కార్యదర్శి గంగయ్య, ధనలక్ష్మి, తదితరులు పర్యటించారు. వర్షాలకు తడిచిన ధాన్యాన్ని పరిశీలించారు.
మరోవైపు … విశాఖపట్టణంలోని అచ్చుతాపురం మండలం ఎర్రవరం, కొండకర్ల, హరిపాలెం గ్రామాల్లో సిపిఎం బృందం పర్యటించింది. తుఫాన్ కారణంగా గ్రామాల్లో ముంపుకు గురైన వరి పంటలను నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు కర్రి.అప్పారావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆర్.రాము మాట్లాడుతూ … ఆరు కాలం కష్టించి పండిరచిన పంట చేతికొచ్చే సమయంలో మిచౌంగ్ తుఫాన్ రూపంలో వర్షాలు కురిసి వరి పంటలు నేలకొరిగాయని, కొన్ని ప్రాంతాల్లో కుప్పలు తడిసిముద్దయిపోయాయని అన్నారు. జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి, ఈదురు గాలులకు వరి పంటతో సహా ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయన్నారు. ధాన్యం వర్షపునీటిలో తడిస్తే మొలకలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. పంట చేతికి వచ్చిన సమయంలో దెబ్బతింటుంటే ఏమీ చేయలేని పరిస్థితులలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తుఫాన్ కారణంగా రైతులు, కౌలు రైతులు పెట్టిన పెట్టుబడి రాకపోగా, తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతారని చెప్పారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అన్ని ప్రాంతాల్లో ప్రజలు కరువుతో అల్లాడుతున్నారని అన్నారు. కొద్దో గొప్పో పండిన పంట చేతికి వచ్చిన దశలో వర్షం పడుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బి.రాంకుమార్, కె.సోము నాయుడు, పి.అప్పలనాయుడు, జి.మల్లయ్య, కె.శివ, తదితరులు పాల్గొన్నారు.
