‘అదానీ’ ఒప్పందాలపై బహిరంగ విచారణ జరపాలి

సిపిఎం డిమాండ్ 
ప్రజాశక్తి-విజయవాడ : అదానీ సంస్థల ద్వారా సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై బహిరంగ విచారణ జరపాలని విద్యుత్ నియంత్రణ మండలికి సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు బుధవారం(ఫిబ్రవరి 21న) లేఖ వ్రాశారు. ఈ లేఖలో సారాంశం ఈ విధంగా ఉంది.
” సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈసిఐ) ద్వారా రాజస్థాన్ లోని ఆదానీ సంస్థల నుండి 17వేల మిలియన్ యూనిట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి విద్యుత్ పంపిణీ సంస్థలు అనుమతి కొరకు విద్యుత్ నియంత్రణ మండలి ప్రతిపాదనలు పంపారు. వాటిపై మండలి నిర్ణయం తీసుకోనున్నది. ఈ దీర్ఘకాలిక ఒప్పందం వల్ల విద్యుత్ వినియోగదారులపై తీవ్రమైన ప్రభావం పడనున్నది. గతంలో బహిరంగ విచారణ జరిగిన సందర్భాల్లో అదానీ కంపెనీలతో ఒప్పందాలపై బహిరంగ విచారణ జరపాలని పలుసార్లు సిపిఎం మరియు పలు సంస్థలు, నిపుణులు కోరారు. ఈ ఒప్పందాల వలన విద్యుత్ వినియోగదారులపై భారాలు పడే అవకాశం ఉన్నది. దీర్ఘ కాలిక ఒప్పంద ప్రతిపాదనలు ప్రజల, విద్యుత్ పంపిణీ సంస్థల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి. పారదర్శకత లేకుండా, వాస్తవాలు బహిర్గతం చేయకుండా, ప్రభుత్వ ఆదేశాలతో ఇటువంటి ఒప్పందాలకు పూనుకోవటం సరికాదు. కావున ఈ ఒప్పందాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని బహిర్గతం చేయాలి, మండలి దీనిపై బహిరంగ విచారణ జరపాలి. ప్రజలు, పార్టీలు, సంస్థలు, వినియోగదారులు ఒప్పందాలపై తమ అభ్యంతరాలను తెలియజేసే అవకాశం చట్టప్రకారం కల్పించాలి. మండలి దీనిపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరాదు. గత తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలు, కార్పొరేట్ల దోపిడీకి అవకాశం కల్పించాయని, కావున వాటిని పునస్సమీక్షిస్తామని వైసిపి, జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ వాటికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ గత ఒప్పందాలను రద్దు చేయకపోగా, మరింత ప్రమాదకర ఒప్పందాలను పూనుకోవడం శోచనీయం. కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగి, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో అదాని కంపెనీలతో ఎస్ఈసిఐ ద్వారా చేసుకునే ఒప్పందాల వలన ప్రజలపై మరింత భారం పెరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పదేపదే వీటిపై మా అభ్యంతరాలను తెలియజేశాము, ఆందోళనలు జరిపాము. కానీ వాటిపై స్పందించకుండా, బహిరంగ విచారణ జరపకుండా నిర్ణయాలు తీసుకునేందుకు పూనుకోవటం తగదు. ఇప్పటికైనా బహిరంగ విచారణ జరపాలని, హానికరమైన ఒప్పందాలను నిలిపివేయాలని కోరుతున్నామని” సిహెచ్ బాబురావు పేర్కొన్నారు.

➡️