కోల్డ్‌స్టోరేజి అగ్ని ప్రమాదంపై విచారణ జరిపి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి : సిపిఎం

vsr

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా దుగ్గిరాలలో శుభమ్‌ మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజిలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ జరిపి బాధిత రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డికి ఆదివారం లేఖ రాశారు. జనవరి 19న జరిగిన ఈ అగ్నిప్రమాదంలో దాదాపు 1.2 లక్షల పసుపు బస్తాలు కాలిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయారని తెలిపారు. ఈ ప్రమాదంపై గుంటూరు జిల్లా కలెక్టరు జనవరి 30న ఒక కమిటీతో విచారణ చేశామని చెబుతున్నా రైతులకు ఎలాంటి సమాచారం ఇప్పటిదాకా ఇవ్వలేదని పేర్కొన్నారు. రైతులు తమ పసుపు పంట అగ్నికి ఆహుతైన అంశంపై ఆందోళనలో ఉన్నారని, తక్షణం ఆర్థికంగా నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. క్వింటా పసుపునకు రూ.11,000 ఇవ్వాలని, పూర్తి ఇన్సూరెన్సును చెల్లించాలని, కోల్డ్‌ స్టోరేజి అద్దెలు, బ్యాంకు రుణాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. బాధిత రైతుల లిస్టు అధికారికంగా ప్రకటించాలని కోరారు. కోల్డ్‌ స్టోరేజి యాజమాన్యం ఇన్సూరెన్స్‌ చేసిన కంపెనీలు ఏవి అనే అంశాలను కూడా రైతులకు సమాచారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అగ్ని ప్రమాదంపై విచారణ నివేదికను పారదర్శకంగా ఇవ్వాలని కోరారు. కొంతమంది రైతులు బాండ్లు యాజమాన్యానికి ఇచ్చినా సరుకు డెలివరీ ఇవ్వలేదని, రికార్డు పుస్తకాల్లో ఇచ్చినట్లు రాసుకున్నందున వారికి కూడా నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

 

➡️